Korukanti Chander | కోల్ సిటీ , జూన్ 29: ‘ఒక ఇల్లు కూల్చడం ఎంతో తేలిక… కానీ అదే ఇల్లు కట్టుకోవాలంటే సామాన్యుడు ఎంత కష్టపడుతాడో కాంగ్రెస్ పార్టీ వారికి తెలియక.. పద్ధతి, ప్రణాళిక లేక.. మాస్టర్ ప్లాన్ తయారీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా కష్ట పడ్డట్లు ఉన్నారని, ఒక దగ్గర కూర్చొని తమకు అనుకూలంగా తయారు చేసుకుని కార్పొరేషన్ అధికారులకు అప్పగించి పంపిస్తున్నారని’ రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు.
తానొకటి అడిగితే వారొక సమాధానం చెప్పి ఇంకెంత కాలం తప్పించుకుంటారని ప్రశ్నించారు. రామగుండం నగర పాలక సంస్థ 48వ డివిజన్ పరిధి అడ్డగుంటపల్లిలో టౌన్ ప్లానింగ్ అధికారులు రోడ్ల వెడల్పు పేరుతో కూల్చివేసిన గృహాల బాధితులను ఆదివారం ఆయన కలిసి పరామర్శించారు. కార్పొరేషన్ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు.
అభివృద్ధికి తాము, తమ పార్టీ వ్యతిరేకం కాదనీ, అది అందరి సమక్షంలో, ఆమోదంతో జరిగితేనే బాగుంటుందనీ, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల నియంత పోకడలను ఎవరూ కూడా స్వాగతించరన్నారు. నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు కాంగ్రెస్ నాయకుల దూతలుగా పని చేయడం అత్యంత బాధాకరమన్నారు. ఇండ్లు కోల్పోయిన వారికి మరో దగ్గర పునరావసం గానీ, ఇందిరమ్మ ఇళ్లలో గానీ అవకాశం కల్పిస్తే అందరు సహకరిస్తారని సూచించారు. గోదావరిఖని పుట్టినప్పటి నుంచి ఉన్న అడ్డగుంటపల్లిలో నిరుపేద దళితుల ఇళ్లను కూల్చి వారిని రోడ్డున పడేయడమే అభివృద్ధా అని ప్రశ్నించారు. కూల్చివేతలలో కూడా ఎక్కడ పారదర్శకత లేదన్నారు. బాధితుల ప్రతీ కన్నీటి బొట్టుకు కారణమైన వారికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
ఎన్నో ఆశలు, కలలతో నిర్మించుకున్న భవంతులు, ఇండ్లను వారి కళ్లెదుటే కూల్చుతున్నప్పుడు బాధితులు పడే బాధలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సామాన్యుడి ఇల్లు కూల్చితే రేపటి నుంచి ఎక్కడ ఉంటాడని తలుచుకుంటేనే దుఃఖం వస్తుందన్నారు. తానొకటి ప్రశ్నిస్తే వాళ్లు తెలివిగా మరో విధంగా సమాధానం ఇచ్చి దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఆస్తి నష్టం కలిగిన బాధితులకు ఇందిరమ్మ ఇళ్లలో అవకాశం కల్పించాలనీ, అది ఆయన బాధ్యత కూడా అని అన్నారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను ముప్పు తిప్పలు పెట్టడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుగుతుందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల వరకే వీరి ఆటలు సాగుతాయనీ, తర్వాత ప్రజల వంతు మొదలవుతుందని జోస్యం చెప్పారు. మాస్టర్ ప్లాన్ పేరుతో ఇంత విధ్వంసం మంచిది కాదన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు మారుతి, నీరటి శ్రీనివాస్, వెంకటేష్ గౌడ్ ఉన్నారు. అలాగే సీపీఐ నాయకులు కందుకూరి రాజారత్నం, శనిగరపు చంద్రశేఖర్, బీఎస్పీ నాయకులు రవికుమార్ తదితరులు కూడా సందర్శించి బాధితులను పరామర్శించారు.