రాజన్న సిరిసిల్ల, మే 7 (నమస్తే తెలంగాణ) : కూలి రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ వార్పిన్ కార్మికులు రోడ్డెక్కారు. యజమానుల మొండి వైఖరిని నిరసిస్తూ బుధవారం సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తి దారుల సంఘం కార్యలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కూలీ పెంచాలని వారం కిందటే యజమానులకు సీఐటీయూ, వార్పిన్ యూనియన్ నాయకులు నోటీసులు ఇచ్చారు. అయినా స్పందించక పోవడంతో వార్పిన్ యూనిట్లు బంద్పెట్టి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా తెలంగాణ వపర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన చీరల ఆర్డర్లు యజమానుల పథకంగా మారిందని విమర్శించారు.
వస్త్ర ఉత్పత్తిదారులు పూర్తిగా కార్మికుల వ్యతిరేకిగా మారారని మండిపడ్డారు. బతుకమ్మ చీరల కన్నా ఈప్రభుత్వం ఇచ్చిన చీరలతో పనిభారం రెండింతలు పెరిగిందని, పనికి తగ్గ కూలీ ఇవ్వాలని అడిగినా యజమానులు ముందుకు రావడం లేదన్నారు. కార్మికులు సమ్మె బాట పట్టినా చేనేత జౌళీశాఖ అధికారుల నిర్లక్ష్యం వీడడం లేదని మండిపడ్డారు. కార్మికుల కూలీని నిర్ణయించాల్సిన అధికారులు యజమానులకు అప్పగించడ వల్ల ఈసమస్య తలెత్తిందని పేర్కొన్నారు.
జౌళీశాఖ అధికారులు కార్మికుల సమస్యలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బట్ట ఉత్పత్తి చేసే కార్మికులతో అధికారులు మాట్లాడడానికి సమయం కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ పథకాలు కార్మికుల ప్రయోజనం కోసమా..? యజమానుల లాభం కోసమా..? చెప్పాలని నిలదీశారు. యజమానులు తమ స్వప్రయోజనాల కోసమే తప్ప కార్మికుల శ్రేయస్సుగురించి ఆలోచించడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు.
అధికారులు స్పందించకుంటే గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, యూనియన్ అధ్యక్షుడు సిరిమల్ల సత్యం, వైపని యూనియన్ అధ్యక్షుడు కుమ్మరికుంట కిషన్, ఉడుత రవి, మచ్చవేణు, ఒగ్గు గణేశ్, ఎలికేటి శ్రీనివాస్, ప్రవీణ్, వెంకటేశ్వర్లు, దోమల రమేశ్, చింతకింది సుధన్ తదితరులు పాల్గొన్నారు.