Bandi Sanjay | పెద్దపల్లి, ఏప్రిల్20: దేశంలోని పేద ముస్లింల సంక్షేమాన్ని కాక్షించి కేంద్ర ప్రభుత్వం వక్ప్ సవరణ బిల్లు చేసిందని కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. వక్ప్ సవరణ బిల్లును వ్యతిరేకంగా ఎంఐఎం ఏర్పాటు చేసిన మీటింగ్‌కు కాంగ్రెస్, సీఎం రేవంత్‌రెడ్డి కర్మ, కర్త, క్రియ అని ఆరోపించారు.
పేద ముస్లింల పొట్టకొట్టేందుకు బడాచోర్లంతా కలిసి మీటింగ్ పెట్టారని దుయ్యబట్టారు. దేశంలో మత కల్లోలాలను సృష్టించేందుకు కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో జరిగిన ఓ విహహా వేడుకలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. స్థానిక సిరి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకర్లు సమావేశంలో మంత్రి మాట్లాడారు. తన పిల్లలను తానే తినే విష సర్పం అతి డెంజరస్ పార్టీ ఎంఐఎం అని విమర్శించారు. వక్ఫ్ బోర్డు భూములతో పేద ముస్లింలకు ఏమైనా న్యాయం జరిగిందా, సవరణ బిల్లుతో అక్రమంగా సాధీనం చేసుకున్న భూములు, ఆస్తుల బండారం బయటపడుతాయని భావించి బడాచోరులంతా కలిసి మీటింగ్ ఏర్పాటు చేసి మతాల మద్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని అందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ నిజమైన వారసుడే.. నరేంద్ర మోడీ
అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలను ముందుకు తీసుకేళ్లుతున్నదే బీజేపీ అని, అంబేద్కర్‌కు నిజమైన వారసుడు నరేంద్ర మోడీ అని పేర్కొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే ఏటా లక్షా 25వేల మంది దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర సర్కారు కృషి చేస్తుందని చెప్పారు. అంబేద్కర్ పేరును ఉచ్చరించే అర్హత కూడా ఒవైసీకి లేదని, అంబేద్కర్ అవమానించే పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. మజ్లీస్ పార్టీ పాత బస్తీలో ఎప్పుడైన అంబేద్కర్ జయంతి, వర్థంతి కార్యక్రమాలు చేపట్టిందా ..? ఎక్కడ అంబేద్కర్ విగ్రహాం ప్రతిష్టించారా? చెప్పాలని డిమాండ్ చేశారు.
టైటిల్ లేని పాపర్టీస్ వక్ఫ్ బోర్డుయేనటా..?
టైటిల్ లేని పాపర్టీస్ అన్నీ వక్ఫ్ బోర్డుయేనటా? దేశంలో 8లక్షల ఎకరాలు రూ.10లక్షల కోట్లకు పైగా ఆస్తులున్నాయని, వక్ఫ్ఆస్తులపై ఏటా రూ.12వేల కోట్లకు పైగా ఆదాయం వస్తున్న ఆ సొమ్మునంతా పేద ముస్లింలకు పంచకుండా బడాచోరులు మింగుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో 77వేల ఎకరాల భూమి వక్ప్ బోర్డు ఆదీనం ఉందని, ప్రతి సంవత్సరం రూ. 1000 కోట్ల ఆదాయం వస్తుందని, ఏ పేద ముస్లిం కుటుంబాలకు ఇచ్చారో స్ఫష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లిం సమాజాన్ని తప్పు దోవ పట్టించి పబ్బం గడుపుకుంటారని, వక్ఫ్ ఆస్తులను అనుభవిస్తున్న బడాచోర్ల బండారం త్వరలోనే బయట పడుతుందని హెచ్చరించారు.
అకాల వర్షానికి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి
అకాల వర్షాలు, వడగండ్ల వానతో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిని రైతులంతా అల్లాడుతుంటే రైతులను ఆదుకోవాల్సిన సీఎం రేవంతరెడ్డి అప్పుల వేట కోసం జపాన్ పర్యటనకు వెళ్లారని విమర్శించారు. కాలయాపన చేయకుండా నష్టపోయిన రైతాంగానికి ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణా రెడ్డి, పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, కందుల సంధ్యారాణి, ఠాకూర్ రాంసింఘ్, పల్లె సదానందం, పర్శ సమ్మయ్య, బెజ్జంకి దిలీప్ కుమార్, శివంగారి సతీష్, మౌఠం నర్సింగం, జంగా చక్రధర్ రెడ్డి, పెండ్యాల కరుణాకర్, ఠాకూర్ కిశోర్ సింగ్, ఠాకూర్ క్రాంతి సింగ్, ఫహీం తదితరులు పాల్గొన్నారు.