గోదావరిఖని : భారత ఎన్నికల కమిషన్ ( Election Commission ) చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిబంధనల మేరకు పూర్తి చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్( MLA Raj Thakur ) సూచించారు. ఎన్టీపీసీ కాకతీయ ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన బీఎల్వోలు (BLOs), బీఎల్ఏలు (BLAs), కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు .
ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లు తొలగించేలా అధికారులు, బీఎల్వోలు, బీఎల్ఏలు సమన్వయంతో పని చేయాలని అన్నారు.ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సర్వే నిర్వహించాలని కోరారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారి పూర్తి సహకారం తీసుకోవాలని, ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, ఇన్చార్జి కమిషనర్ అరుణ శ్రీ, సంబంధిత అధికారులు, బీఎల్వోలు, బీఎల్ఏలు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.