INTUC | గోదావరిఖని : కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కి పాల్పడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుబంధ సింగరేణి ఐఎన్టీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో INTUC సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాంపెల్లి సమ్మయ్య, వైస్ ప్రెసిడెంట్ వడ్డేపల్లి దాసు మాట్లాడారు.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయ చక్రం తిప్పినట్లు చెప్పుకునే గడ్డం కుటుంబం, పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తూ కార్యకర్తల మధ్య విభేదాలు సృష్టిస్తూ, కాంగ్రెస్ పార్టీకి హాని కలిగించే విధంగా వ్యవహరిస్తుండటం తీవ్రంగా ఖండించదగిన విషయమని అన్నారు. ఒకవైపు అజాత శత్రువుగా పేరుగాంచిన, గొప్ప ప్రజానేత అయిన మంత్రి శ్రీధర్ బాబు పై విమర్శలు చేయడం గడ్డం కుటుంబం రాజకీయ పతనానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు. తమ రాజకీయ జీవితాన్ని పెద్దపల్లి జిల్లా అభివృద్ధికి అంకితమిచ్చిన శ్రీధర్ బాబు, కులాలు, వర్గాలతో సంబంధం లేకుండా అనేక మంది యువతకు నాయకత్వాన్ని అందిస్తూ గ్రామస్థాయి నుంచి పట్టణ అభివృద్ధి వరకు అనేక ఘన విజయాలను సాధించినట్లు పేర్కొన్నారు.
SC వర్గీకరణ నిర్ణయాన్ని స్వాగతించాల్సిన సమయంలో పార్టీకి చిత్తశుద్ధితో పనిచేయాల్సిన ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, ఎంపీ వంశీకృష్ణ పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనడం బాధాకరమన్నారు. పెద్ద పారిశ్రామికవేత్తలుగా తమను తాము చెప్పుకునే గడ్డం కుటుంబం దేశవ్యాప్తంగా 12 తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నా.. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కటైనా స్థాపించకపోవడం దారుణమని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ సదానందం, రిజినల్ జనరల్ సెక్రటరీ టైసన్ శ్రీనివాస్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ గడ్డం కృష్ణ, మందమర్రి వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య, నాయకులు లాగిశెట్టి ఆంజనేయులు, నయీం, వెంకటేశ్వర్లు, కంకణాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.