Godavarikhani | కోల్ సిటీ, జనవరి 15: భూమిపై స్వర్గంగా పిలవబడే అద్భుతమైన ప్రకృతి సౌందర్యం.. హిమాలయాలలోని మంచుతో కప్పబడిన శిఖరం.. జాలువారే లోయలకు ఆనవాళ్లు కాశ్మీర్ అందాలు.. మరోవైపు నవలలు.. సినిమాలు.. ఊహలకే పరిమితమైన జల కన్యలు.. ఇక్కడ సందడి చేస్తున్నాయి. నీటిలో విహరిస్తూ విన్యాసాలతో సందర్శకులను అబ్బుర పరుస్తున్నాయి. చిన్నారులకు, యువతకు ఫ్లయింగ్ కిస్ లతో హాయ్ చెబుతూ మనసు దోచుకుంటున్నాయి. ఇక కాశ్మీర్ అందాలు ఎనలేని ఆహ్లాదంను పంచుతూ కట్టిపడేస్తున్నాయి. చూడటానికి రెండు కండ్లు సరిపోని మరో లోకంలో అడుగుపెట్టామా? అన్న అనుభూతి ని కలిగిస్తున్నాయి.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ చాలా ప్రత్యేకతను, ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి గోదావరిఖనికి వచ్చిన సందర్శకులతో ఎగ్జిబిషన్ కిటకిటలాడుతోంది. చిన్న పెద్ద అందరూ ఈ ఎగ్జిబిషన్ సందర్శించి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా కాశ్మీర్ అందాలు, జలకన్యలు తోపాటు చాలా అహ్లాదకరమైన వాతావరణం.. గొప్ప అనుభూతిని కలిగించే ఆట వస్తువులు, వివిధ రకాల స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు అస్లాం మాట్లాడుతూ ఇదివరకు ఎప్పుడు లేని విధంగా కనివిని ఎరుగని రీతిలో కోల్ బెల్ట్ పారిశ్రామికం ప్రాంత ప్రజలకు గొప్ప అనుభూతిని కలిగించాలన్న ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్లో అందుబాటులోకి తీసుకువచ్చామని, రెండు నెలల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లో అడుగుపెట్టగానే మరో ప్రపంచంలోకి వెళ్లిన మధురానుభూతి కలుగుతుందని, పారిశ్రామిక ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.