కాల్వశ్రీరాంపూర్, జూలై 13 : మండలంలోని మల్యాలలో కొన్ని రోజులుగా విష జ్వరాలు ప్రబలి పలువురు మంచం పట్టారు. గ్రామంలో ఇంటికొకరు జ్వరం తో బాధపడుతున్నారు. జ్వరంతోపాటు ఒల్లంతా తీవ్ర నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. కనీసం లేచి నడవలేకపోతున్నారు. వైద్యం కోసం కొంత మంది కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వ దవాఖానకు, మరి కొంతమంది ప్రైవేటు దవాఖానల చుట్టూ తిరుగుతున్నారు.
అయినా నయం కాకపోవడంతో గ్రామంలో రోజు రోజుకూ జ్వరపీడితుల సంఖ్య పెరుగుతున్నదని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో పారిశుధ్యం లోపమా, లేక మంచినీటి కలుషితమా అనేది అంతుపట్టడంలేదంటూ పలువురు పేర్కొన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి వైధ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.