వేములవాడ, అక్టోబర్ 16: వందల ఏండ్ల చరిత్ర కలిగిన దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయంలో అత్యంత వైభవోపేతంగా నిర్మాణాలు చేయాలని మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్ సూచించారు. ఆలయాన్ని నాలుగు స్తంభాల సిమెంట్ పిల్లర్లతో నిర్మించి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాతి కట్టడాలే చేపట్టాలని స్పష్టం చేశారు. వేములవాడ పట్టణంలోని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినోద్‌కుమార్ మాట్లాడారు. దేశంలోని లక్షలాది మంది భక్తుల ఇలవేల్పుగా వెలుగుందుతున్న రాజన్న ఆలయ అభివృద్ధికి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలోనే అడుగులు పడ్డాయని, ఆనాడే 30కోట్లతో 30 ఎకరాలకు పైగా స్థల సేకరణ జరిగిందని గుర్తుచేశారు.
ఇప్పుడు చేపట్టబోయే పనులు గత ప్రభుత్వంలో సేకరించిన భూముల్లోనే జరుగుతున్నాయని వివరించారు. అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతులకు చెతులెత్తి మొక్కుతున్నామన్నారు. అయితే స్వామివారి ఆలయానికి పునర్వైభవం వచ్చేలా గతంలోనే రూపొందించిన నివేదికలకు శృంగేరి పీఠాధిపతి అనుమతి కూడా వచ్చిందని గుర్తు చేశారు. రాతి కట్టడాలతోనే నిర్మించాలని భావించి ఉన్నందున ఆ మేరకు ముందుకుసాగాలని సూచించారు. ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల టైం ఉందని, విప్ ఆది శ్రీనివాస్ హడావుడిగా చేపట్టే పనులకు తొందరేమీ లేదని హితవు పలికారు. తమిళనాడు కృష్ణశిలతో అత్యంత వైభవంగా నిర్మించిన యాదాద్రి తరహాలో రాజన్న ఆలయ నిర్మాణం జరిగేలా సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని సూచించారు.
ఆలయ అభివృద్ధి పనులు ప్రజలకే తెలియలేని పరిస్థితిలో ఉన్నాయని విమర్శించారు. పనులను అడ్డుకుంటారనే ముందస్తుగా హైకోర్టులో కేవియట్ పిటిషన్ వేశారనే వార్తలు చూశానని, పనులు సక్రమంగా చేస్తే ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. చేసే పనుల్లోనే స్పష్టత ఉండదని, అందుకే ఇలాంటి పిటిషన్లు వేయించడంలో ముందుంటారని ఎద్దేవా చేశారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకుడు గూడూరు ప్రవీణ్, సెస్ మాజీ డైరెక్టర్ రామతీర్థపు రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, పట్టణ మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి రామ్‌చందర్, నరాల శేఖర్, జోగిని శంకర్, గోలి మహేశ్, నాయకులు కొండ కనుకయ్య, నీరటి మల్లేశం, వెంగళ శ్రీకాంత్ గౌడ్, అంజద్ పాషా, రూరల్ మండలాధ్యక్షుడు గోస్కుల రవి, నాయకులు కటకం మల్లేశం, వెంకట్ రెడ్డి, హింగే కుమార్, సందీప్, సాయి, రఫీ, రాధాకిషన్‌రావు ఉన్నారు.
రాజన్న ఆలయంలో చేపట్టబోయే పనులపై స్పష్టత కోసం భక్తుల పక్షాన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను కలిసి వివరిస్తాం. మాస్టర్ ప్లాన్‌లో ముందుగా భక్తుల నిత్యాన్నదానం, క్యూ కాంప్లెక్స్, అభిషేక మండపాల భవనం నిర్మించాలి. కానీ, వాటిని వదిలేసి రాజన్న ఆలయ అభివృద్ధి పనులు ఎందుకు మొదలు పెడుతున్నారు? దశలవారీగా పనులు చేపట్టాలి. భక్తులకు దర్శనాలు కల్పిస్తూనే అభివృద్ధి చేయాలి. కానీ, ఆలయం బంద్ చేస్తున్నామనే గందరగోళ ప్రకటనలు చేస్తూ భక్తులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారు.
– చల్మెడ లక్ష్మీనరసింహారావు, బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి
ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వాలి. భక్తులు సమర్పించిన సుమారు 90 కిలోల బంగారం, టన్నుల కొద్ది వెండిని అభివృద్ధి పనుల కోసం కుదువ పెట్టాలని ప్రభుత్వం చూస్తున్నది. అలా చేస్తే మేం ఊరుకోం. భక్తుల పక్షాన నిలదీస్తాం. ప్రభుత్వమే నేరుగా నిధులు కేటాయించాలి.
– వినోద్ కుమార్
సమ్మక జాతరకు వెళ్లే భక్తులు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. అభివృద్ధి పేరిట ఆలయాన్ని మూసివేస్తామని చేసిన గందరగోళ ప్రకటనలతో అనేకమంది ఆందోళన చెందుతున్నరు. జాతర జనవరిలో ఉన్నందున ఈ రెండు నెలలు దర్శనం కల్పించాలి. శివరాత్రి వరకు యథావిధిగా దర్శనాలు కొనసాగించాలి. ఆలయం మీదే ఆధారపడి జీవించే దాదాపు 5వేల చిరువ్యాపారుల కుటుంబాల ఉపాధి దెబ్బతినకుండా చూడాలి.
– వినోద్ కుమార్