గంగాధర, జూలై 9: మండలంలోని బూరుగుపల్లి ఊర చెరువు మత్తడి దుంకుతున్నది. ఐదు రోజుల క్రితం రామడుగు మండలం లక్ష్మీపూర్ పంపుహౌస్ నుంచి వరద కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. బూరుగుపల్లి వద్ద వరద కాలువకు ఏర్పాటు చేసిన తూముల ద్వారా ఊర చెరువులోకి నీరు వచ్చి చేరింది. నిర్విరామంగా నీరు రావడంతో చెరువు నిండుకుండను తలపిస్తున్నది. ఆరేళ్లలో చెరువు తొమ్మిది సార్లు మత్తడి దుంకింది. చెరువు మత్తడి దుంకుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మత్తడి వద్దకు చేరుకొని సంబురాలు చేసుకుంటున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో సాగు నీటికి ఇక్కట్లు
ఉమ్మడి రాష్ట్రంలో బూరుగుపల్లి గ్రామం పక్క నుంచే వరద కాలువ వెళ్తున్నా సాగు నీటికి ఇక్కడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద కాలువలో చుక్కా నీరు లేక ఎడారిని తలపించేది. భూగర్భ జలాలు అడుగంటిపోయి చెరువులో నీళ్లు లేక ఎటు చూసినా బీడు భూములే కనిపించేవి. చెరువులో నీళ్లు లేకపోవడంతో సాగు నీటి కోసం రైతులు వరద కాలువలో గోతులు తవ్వేవారు, వేలాది రూపాయలతో కిలోమీట్లర మేరకు పైపులైన్లు వేసుకొని పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేసేవారు. ఏడాదికి ఒక పంట వేయడం గగనం కాగా, యాసంగి పంటలు వేయడమే రైతులు మరచిపోయారు.
నేడు నిండుకుండలా ఊర చెరువు
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ను నిర్మించడంతో ఇక్కడి రైతుల జీవితాల్లో మార్పు వచ్చింది. రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రీ పంపుహౌస్ నుంచి వరద కాలువకు నీటిని విడుదల చేయడంతో బూరుగుపల్లి గ్రామ రైతుల దశ మారింది. వరదకాలువ జీవనదిలా మారింది. వరద కాలువ ద్వారా చెరువులను నింపడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 297 కోట్లతో 11 తూములను ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 10, 2018లో బూరుగుపల్లి వద్ద వరదకాలువ 96.55 కిలోమీటర్ వద్ద తూము ఏర్పాటు చేశారు. ఇక్కడి తూము నుంచి బూరుగుపల్లి ఊర చెరువులోకి నీరు చేరడంతో జలకళను సంతరించుకుంది. బూరుగుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో వ్యవసాయయోగ్యమైన భూమి 1734 ఎకరాలు ఉండగా 1440 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బీడుగా మారిన భూములు ప్రస్తుతం పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్నాయి.
వానల కోసం ఎదురు చూడడం లేదు
వానల కోసం ఆకాశం వైపు చూసి పంటలు సాగు చేయడాన్ని ఎప్పుడో మరచిపోయినం. చెరువులో నీళ్లు ఉండడంతో ధీమాగా పొలం సాగు చేస్తున్న. పదేళ్ల కింద ఇట్ల చెరువుల నీళ్లు లేవు. వరదకాలువ ఎండిపోయి ఉండేది. వానలు పడకపోతే పొలం బీడుగా ఉండేది. తెలంగాణ ప్రభుత్వం వరద కాలువకు నీళ్లు విడుదల చేస్తున్నప్పటి నుంచి చెరువు పూర్తి స్థాయిలో నిండుతున్నది. దీంతో ఏడాదికి రెండు పంటలు సాగు చేస్తున్న. ఇదంతా సీఎం కేసీఆర్ పుణ్యమే. రైతులంతా కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం.
-సాగి సత్యనారాయణరావు, బూరుగుపల్లి
రెండు పంటలు సాగు చేస్తున్నం
మా ఊరి పక్కనే వరద కాలువ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో వరద కాలువలో నీళ్లు లేకపోవడంతో ఎడారిగా కనిపించేది. కాలువ లోతుగా ఉండడంతో చెరువులో, బావుల్లో చుక్క నీరు ఉండేది కాదు. వరద కాలువలో గుంతతవ్వి అక్కడి నుంచి పైపులైన్ వేసుకొని పొలానికి నీళ్లు పెట్టెటోన్ని. వేలాది రూపాయలు ఖర్చు అయ్యేది. తెలంగాణ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ను నిర్మించి వరద కాలువకు నీళ్లు వదిలిన తర్వాత మా ఊరి చెరువు పూర్తి స్థాయిలో నిండుతున్నది. ఏడాదికి రెండు పంటలు పండిస్తున్న.
-గడ్డం స్వామి, బూరుగుపల్లి
దుబాయ్ పోవుడు బందు చేసిన
ఉమ్మడి రాష్ట్రంలో ఊరిలో ఉపాధి లేక దుబాయ్ పోయిన. అక్కడికి పోయినంక చాలీచాలనీ జీతంతో ఇబ్బందులు పడ్డ. అక్కడ ఉండలేక ఇంటికి వచ్చి కుల వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న. ఆరేళ్ల కింద తెలంగాణ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి వరద కాలువకు నీళ్లు వదలడంతో మా ఊరి చెరువు నిండి మత్తడి దుంకింది. భూమి కౌలుకు తీసుకొని ఆరేళ్లుగా వ్యవసాయం చేస్తున్న. ఇప్పుడు రందీ లేకుండా బతుకుతున్నం. ఇదంతా తెలంగాణ సర్కారు పుణ్యమే.
-దూలం పర్శయ్య, బూరుగుపల్లి