Chigurumamidi | చిగురుమామిడి, సెప్టెంబర్ 1 : రోడ్డు విస్తరణ పనులకు గ్రామస్తులు సహకరించాలని కరీంనగర్ ఆర్డీవో షర్మిల గ్రామస్తులను కోరారు. చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రోడ్డు విస్తరణకు సంబంధించిన అంశాలపై మంగళవారం సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీవో హాజరై మాట్లాడారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజల రాకపోకలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రోడ్డు విస్తరణ ఎంతో అవసరమని ఆర్డీవో అన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రహదారిని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
రోడ్డు విస్తరణలో భాగంగా భూములు, ఇళ్లు లేదా ఇతర ఆస్తులు ప్రభావితమయ్యే గ్రామస్తుల సమస్యలను అధికారులు నిబంధనల ప్రకారం పరిశీలిస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గ్రామసభలో నమోదు చేసుకుని, ఇతర ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రామస్తులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, అధికారులు అందించే సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. రోడ్డు విస్తరణ వల్ల గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యాలు, వ్యాపార అభివృద్ధి, అత్యవసర సేవలకు సులభమైన రాకపోకలు కలుగుతాయని అన్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇళ్లకు మార్కింగ్ అధికారులు వేయడం జరిగిందని, వాటిపై పూర్తి సందేహాలు ఉన్నాయని బాధితులు ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. వాటిని మరోసారి నిబంధన ప్రకారం మార్కింగ్ చేయాలని ఆర్డిఓ ను కోరారు.
ఈ గ్రామ సభలో సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య, ఆర్అండ్బీ డీఈ రాజశేఖర్, తహసీల్దార్ కోడం కనకయ్య, ఎంపీడీవో రామ్మోహన్ చారి, ఎస్సై జగదీశ్వర్, ఆర్అండ్బీ ఏఈ సురేష్, ఉప సర్పంచ్ పైడిపల్లి వెంకటేష్, ఆర్ఐ రజనీకాంత్ రెడ్డి, జీపీవో బాలరాజు, పంచాయతీ కార్యదర్శి స్వప్న వార్డు సభ్యులతో పాటు వివిధ పార్టీల నాయకులు, మాజీ ఎంపీటీసీ సాంబారి కొమురయ్య, పెసరి రాజేశం, బుర్ర తిరుపతి, పూదరి వేణు, సాంబారి బాబు, కయ్యం తిరుపతి, కయ్యం కనకయ్య, బరిగెల సదానందం, ముప్పిడి రాజిరెడ్డి, రంగు లక్ష్మయ్య, జెట్టి రాజు గ్రామస్తులు పాల్గొన్నారు.