Renu Desai | హైదరాబాద్లో ఇటీవల జరిగిన వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో అర్ధరాత్రి వరకు సాగిన డీజే మోతలు, మద్యం మత్తులో చేసిన హంగామాపై సినీ నటి రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. భక్తి అనేది ప్రశాంతతను ఇవ్వాలి తప్ప, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఉండకూడదని ఆమె పేర్కొన్నారు.నగరంలో డీజేల గోల ఏ స్థాయిలో ఉందో వివరిస్తూ.. తాను 18వ అంతస్తులోని సౌండ్ ప్రూఫ్ గదిలో ఉన్నప్పటికీ ఆ తీవ్ర శబ్దాలను తట్టుకోలేకపోయానని తెలిపారు. ప్రస్తుతం నగరంలో జ్వరాలతో బాధపడుతున్న రోగులు, వృద్ధులు, చిన్న పిల్లలు ఈ శబ్ద కాలుష్యం వల్ల ఎంతటి నరకాన్ని అనుభవిస్తున్నారో ఊహించుకుంటేనే బాధగా ఉందన్నారు.
భారతీయులలో ఐక్యత పెంపొందించేందుకు లోకమాన్య తిలక్ వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభిస్తే, నేటితరం వాటిని ‘డీజే పార్టీలు’గా మార్చేయడం విచారకరమని ఆమె వాపోయారు. మద్యం తాగి హంగామా చేయడానికి, భక్తికి అసలు ఏమాత్రం సంబంధం లేదని గుర్తుచేశారు. తోటివారికి ఇబ్బంది కలగకుండా నడుచుకోవడమే నిజమైన సంస్కారమని, ఇతరులను బాధిస్తూ జరుపుకునే వేడుకలను సనాతన ధర్మం ఎంతమాత్రం ఆమోదించదని రేణు దేశాయ్ స్పష్టం చేశారు. పండుగల పేరుతో జరుగుతున్న ఈ మార్పులపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.