Narayanpur | గంగాధర, మార్చి13 : గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామాన్ని పంపు గ్రామంగా ప్రకటించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామంలోని చావటి వద్ద శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఏలుగా నారాయణపూర్ రిజర్వాయర్ తో ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. రిజర్వాయర్ ను నీటితో నింపిన ప్రతిసారి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు. కట్ట జాలు పట్టి, దుర్వాసనతో కూడిన నీరు ఇళ్లలోకి చేరుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
గోడలు తడిగా మారి పగుళ్లు ఏర్పడుతున్నాయని, ఎప్పుడు కూలుతాయో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నట్టు తెలిపారు. ఏడాది క్రితం అధికారులు గ్రామంలో సర్వే నిర్వహించగా, గ్రామం మొత్తాన్ని ముంపుగా తీసుకోవాలని వారిని కోరినట్లు తెలిపారు. గ్రామంలో కేవలం 27 ముంపు క్రింద తీసుకుంటున్నారని, మిగిలిన గ్రామస్తుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. తాను గెలిచాక ముంపు సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇప్పటివరకు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి ఆర్అండ్ఆర్ పథకం కింద తమకు న్యాయం చేయాలని కోరారు.