Sundaragiri | చిగురుమామిడి, జూలై 9 : మండలంలోని సుందరగిరి గ్రామంలో గ్రామస్తులు బుధవారం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. హుస్నాబాద్ నుండి కొత్తపెళ్లి వరకు నాలుగు వరుసల రోడ్డు మంజూరు కాగా, గ్రామం నుండి రోడ్డు వేసినట్లయితే వందలాది ఇల్లు కోల్పోతామని నిరసిస్తూ సుందరగిరిలో గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు.
గ్రామం నుండి కాకుండా సర్వే చేసిన బైపాస్ నుండి నాలుగు వరుసల రహదారి వేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనతో కరీంనగర్ హుస్నాబాద్, హుజురాబాద్ వైపు వెళ్తున్న వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సంఘటన స్థలానికి ఎస్సై సాయికృష్ణ, తహసీల్దార్ మద్దసాని రమేష్ వచ్చి గ్రామస్తులతో మాట్లాడారు. రోడ్డుపై ఆందోళన చేయడం సరైంది కాదని, ఏమైనా సమస్య పరిష్కారం కావాలంటే వినతిపత్రం అందజేయాలని, వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.
ఎస్సై సాయికృష్ణ మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలని గ్రామస్తులు సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, వివిధ పార్టీల నాయకులు భాకం సంపత్ కుమార్, తాళ్లపల్లి చిన్న చంద్రయ్య, కక్కర్ల వెంకటేశం, ఎలగందుల రాజు, ములుగురి శ్రవణ్ తో పాటు 80 మందికి పైగా గ్రామస్తులు పాల్గొన్నారు.