పల్లెలు తల్లడిల్లుతున్నాయి. మొన్నటిదాకా పచ్చని పొలాలు.. చిక్కని బంధాలు.. ఎటు చూసినా ఆహ్లాదకర వాతావరణం, ఇంటిముందు, ఇంటి వెనుక పెరట్లో పరుచుకున్న పచ్చదనంతో స్వచ్ఛమల్లెలుగా విలసిల్లిన గ్రామాలు, నేటి కాంగ్రెస్ ప్రభుత్వ పట్టింపులేమితో ఆనవాళ్లను కోల్పోయే స్థితికి చేరాయి. గత బీఆర్ఎస్ సర్కారు నెలనెలా నిధులు మంజూరు చేయగా, కొత్తగా కొలువుదీరిన సర్కారు నెలలుగా నిధులు ఇవ్వకపోడంతో పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయి అధ్వానంగా కనిపిస్తున్నాయి. కనీసం జీపీ సిబ్బందికి జీతాలు ఇచ్చుకోలేని, కరెంట్ బిల్లులు చెల్లించలేని దుస్థితిలో మగ్గిపోతుండగా, ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
– కరీంనగర్, మే 19, (నమస్తే తెలంగాణ)
దశాబ్దం క్రితం సమైక్య రాష్ట్రంలో పాలకుల పట్టింపులేనితనంతో పల్లెలు నిరాదరణకు గురయ్యాయి. ఉపాధి లేక బతుకుదెరువు కోసం ప్రజలు పట్టణాలకు వలస పోగా, జన సంచారం లేని ఇండ్లు కాస్త పాడుబడ్డ కొంపలుగా మారిపోయాయి. నిధుల లేమితో అభివృద్ధి కార్యక్రమాలు కాదు కదా కనీసం మురుగు కాలువలు శుద్ధి చేసి, బ్లీచింగ్ పౌడర్ సైతం చల్లలేని దుర్భరమైన స్థాయికి దిగజారిపోయాయి. ఈ క్రమంలో స్వరాష్ట్రం సాధన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు పల్లెల అభివృద్ధిపై దృష్టిపెట్టింది. అందులో భాగంగా ప్రతి నెలా పల్లెలకు నేరుగా నిధులను మంజూరు చేస్తూ, ప్రజల భాగస్వామ్యంతో పల్లెలను శోభాయమానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2019 సెప్టెంబర్ 6న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మొదలు పెట్టగా, అనతికాలంలోనే గ్రామాలు కొత్తందాలను సంతరించుకున్నాయి. అయితే ఆరు నెలల కింద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీల గురించి పట్టింపు లేకుండా వ్యవహరిస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులు ఇవ్వకపోవడంతో నిర్వహణ భారంగా మారింది.
2018- నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని అమలులోకి తెచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెలనెలా పంచాయతీలకు నిధులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్ఎఫ్సీ) ద్వారా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం నిధుల ద్వారా పంచాయతీలకు నిధులు వచ్చేవి. ఈ రెండు పథకాల ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పంచాయతీలకు ప్రతి నెలా రూ.27 కోట్ల వరకు వచ్చేవి. కరీంనగర్ జిల్లాలోని 313 పంచాయతీలకు ప్రతి నెలా రూ.9 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు వచ్చేవి. జగిత్యాలలోని 380 గ్రామ పంచాయతీలకు రూ.6.90కోట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 255 పంచాయతీలకు ప్రతి నెలా రూ.4.23 కోట్లు, పెద్దపల్లి జిల్లాలోని 267 పంచాయతీలకు రూ.6 కోట్లు వచ్చేవి. ఈ నిధులతో విద్యుత్ బిల్లులు చెల్లించడం, పారిశుధ్య, ట్రాక్టర్ల నిర్వహణ, ఇతర అభివృద్ధి పనులను పంచాయతీలు చేపట్టేవి.
గత కొంత కాలంగా ఎస్ఎఫ్సీ నిధులు రాకపోవడం, ఫిబ్రవరి నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా అందక పోవడంతో పంచాయతీలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఒక్కో పంచాయతీకి స్థానిక జనాభా ఆధారంగా నిధులు వచ్చేవి. పంచాయతీల పరిధిలోని వ్యవస్థలను నిర్వహించుకోవడంతోపాటు అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు ఎలాంటి నిధులూ రాకపోవడంతో అనేక పంచాయతీలకు స్థానికంగా వసూలు చేసుకునే జనరల్ ఫండే దిక్కుగా మారింది. అయితే, అది అంతగా లేని చిన్న పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చెత్త సేకరణకు ట్రాక్టర్లు కదలని పరిస్థితి కనిపిస్తోంది.
జూలపల్లి, మే 19: గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, ఇతర పనుల కోసం ట్రాక్టర్ కొనుగోలు చేశారు. అయితే కొన్ని నెలలుగా నిధుల కొరతతో రూ.2,45,582 లక్షలు ఈవీఎంలు చెల్లించలేదు. దీనికి తోడు రూ.20 వేల దాకా డీజిల్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడంతో వైకుంఠధామం నిరుపయోగంగా మారింది. ఐదు నెలల నుంచి పంచాయతీ సిబ్బందికి (రూ. 95 వేలు) జీతాలు చెల్లించలేదు. రూ.1,49,224 లక్షల కరెంట్ బిల్లులు బకాయి ఉంది. మూడు నెలల నుంచి కొత్త పంచాయతీ భవనం పనులు నిలిచిపోయాయి. దాదాపు రూ.10 లక్షల నిధులతో పనులు చేసిన గుత్తేదారుకు బిల్లులు చెల్లించ లేదు. కిరాయి ఇంట్లో పంచాయతీ పాలన కొనసాగుతుంది. పాలకవర్గం సమావేశాలు, గ్రామ సభలు ఆరు బయట నిర్వహిస్తూ నానాతంటాలు పడుతున్నారు.
కరీంనగర్ మండలం చేగుర్తి గ్రామం 1,530 మంది జనాభా ఉన్న చిన్న పంచాయతీ. గతంలో ఎస్ఎఫ్సీ, ఆర్థిక సంఘం కింద ప్రతి నెలా రూ.2.40 లక్షల వరకు నిధులు వచ్చేది. దీంతో ట్రాక్టర్, పారిశుధ్య నిర్వహణ, విద్యుత్ బిల్లుల చెల్లింపు వంటివి చేసేవారు. మిగిలిన నిధులతో అవసరమైన అభివృద్ధి పనులు చేసుకునే వారు. గడచిన ఆరు నెలలుగా ఎలాంటి నిధులూ లేక పోవడంతో అభివృద్ధి ఆగిపోయింది. ఉన్న కొద్ది పాటి నిధులతో పంచాయతీ నిర్వహణ జరుగుతోంది. దీనికి తోడు గత ఫిబ్రవరి నుంచి మిషన్ భగీరథ ఇంట్రా విలేజ్ పైప్ లైన్ నిర్వహణ పంచాయతీలకు ఇవ్వడంతో ఈ గ్రామంలో తరుచూ పైప్‌లైన్ పగిలి పోతోంది. ఇప్పుడు ఇది అదనపు ఖర్చుగా మారింది. ప్రతి నెలా రూ.10 వేల నుంచి రూ.15 వేలు పైప్‌లైన్ నిర్వహణకు ఖర్చవుతోంది. ఉన్న నిధులు నిండుకుంటున్నాయి. ఇంకో నెల వరకు నిధులు సరిపోతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్స్ విడుదల చేయకుంటే ఈ గ్రామం పరిస్థితి ఆగమ్యగోచరమే. జిల్లాలో అనేక పంచాయతీల పరిస్థితి ఇలాగే ఉంది.
పంచాయతీల నిర్వహణ కార్యదర్శులకు పెనుభారంగా మారింది. జనరల్ ఫండ్ అందుబాటులో లేకపోవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లు రాకపోవడంతో పంచాయతీల్లో ఖజానా లేకుండా పోయింది. అయితే, పంచాయతీలు విధిగా చేపట్టాల్సిన కొన్ని కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు పంచాయతీ కార్యదర్శులపై పడింది. ముఖ్యంగా తడి, పొడి చెత్త సేకరణకు ట్రాక్టర్లు తప్పని సరిగా వినియోగించాలి. కొందరు కార్యదర్శులు అప్పులు చేసి ట్రాక్టర్ డీజిల్ ఖర్చులు భరించి వాటిని నిర్వహిస్తున్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. అసలే ఆర్థిక భారంతో నలిగి పోతున్న పంచాయతీలకు మిషన్ భగీరథ కింద ఇంట్రా విలేజ్ పైప్‌లైన్ నిర్వహణ బాధ్యతలను అప్పగించడంతో మరింత ఆర్థిక భారం తప్పడం లేదు.
కేసీఆర్ సర్కారు మారిన ఆరునెలల్లోనే పల్లెలు అతలాకుతలమయ్యాయి. ‘నమస్తే తెలంగాణ’ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పరిశీలిస్తే పల్లె పాలనలో తలెత్తిన సమస్యలు వెలుగు చూశాయి. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మండలం సంగెం, సారంగాపూర్ లచ్చనాయక్ తండా, వెల్గటూర్ మండలం శాఖాపూర్, పెగడపల్లి, మల్లాపూర్ మండలం గొర్రెపెల్లి గ్రామాల్లో మొన్నటి వరకు నిర్వహించిన నర్సరీల్లో మొక్కలు ఎండిపోయాయి. గ్రామాలకు సరిగా నిధులు రాకపోవడంతో కొనుగోలు చేసిన ట్యాంకర్లు, ట్రాక్టర్లు, ట్రాలీలకు నెలవారీ కిస్తీలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. గ్రామ శివారుల్లో స్వాగత తోరణాలుగా ఏపుగా పెరిగిన చెట్లకు నీరు పట్టే పరిస్థితి లేక అవి తమ ఉనికిని కోల్పోయాయి. ట్రాక్టర్లలో డీజిల్ పోసేందుకు సైతం డబ్బులేకపోవడంతో గ్రామంలోని మొక్కలకు నీళ్లు పట్టే పరిస్థితి లేకుండాపోయింది.
సఫాయి కార్మికులకు, ఎలక్ట్రీషీయన్ లాంటి ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు బకాయి పడిపోయాయి. కార్మికులు పనిచేసేందుకు ఆసక్తి చూపించకపోవడంతో మురుగు కాలువలు నిండిపోయి, ఎక్కడి వ్యర్థాలు అక్కడే పేరుకుపోయాయి. తడిచెత్త, పొడి చెత్త సేకరణ అటకెక్కిపోయింది. గ్రామాల్లోని వీధి దీపాలతోపాటు, ఇతర విద్యుత్ సరఫరాలకు సంబంధించిన బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. లక్షల కొద్దీ కరెంట్ బిల్లులు బకాయిపడ్డాయి. ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు నిర్వహణ లేకపోవడంతో వాటి ఉనికికే ప్రమాదం వచ్చిపడింది. ఏడెనిమిది నెలల క్రితం వరకు ఉద్యానవనాలుగా దర్శనమిచ్చిన ప్రకృతి వనాలు నేడు పాడుబడిపోయాయి. చాలా గ్రామాల్లో హరితహారాల్లో భాగంగా నాటిన మొక్కలను కొట్టేశారు. జగిత్యాల రూరల్ మండలం హన్మాజీపేట శివారులో భారీగా పెరిగిన హరితహారం చెట్లను విద్యుత్ తీగలకు అడ్డువస్తున్నాయనే కారణంతో కొట్టివేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మొత్తానికి పాలకుల పట్టింపులేని తనం, నిధుల విడుదలలో జాప్యంతో పల్లెలు తమ ప్రభను కోల్పోతున్నాయి.
అసలే అతనిది పేద కుటుంబం. 2019లోనే పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించాడు. తల్లి దండ్రులు, భార్య పిల్లలు అతనిపైనే ఆధార పడి జీవిస్తున్నారు. వచ్చేది రూ.30 వేల జీతం. ఆరు నెలలుగా పంచాయతీలకు నిధులు రాకపోవడంతో అతని జీతం నుంచే పంచాయతీకి డబ్బులు ఖర్చు చేస్తుండగా తన ఇంటి అవసరాలు తీరడం లేదు. తల్లిదండ్రులకు మందులు, పిల్లల చదువులు, ఇంటి అద్దె, కుటుంబ పోషణ కష్టమవుతున్నది. వచ్చే జీతంలో దాదాపుగా రూ.15 వేల నుంచి రూ.20 వేల దాకా పంచాయతీ కరెంటు, డీజిల్ బిల్లులకే పోతున్నది. ఇదీ పెద్దపల్లి మండలంలో పనిచేస్తున్న ఓ పంచాయతీ కార్యదర్శి పరిస్థితి. ఇలాగైతే తామెలా బతికేదని వాపోతున్నాడు. ఇది ఈ ఒక్క కార్యదర్శి బాధ కాదు.. మెజార్టీ పంచాయతీల కార్యదర్శుల పరిస్థితి ఇలాగే ఉంది.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని 1,700 జనాభాగల ఒక చిన్న గ్రామానికి గతంలో ప్రతి నెలా రూ.1.20 లక్షల గ్రాంట్లు వచ్చేవి. ఇప్పుడు ఇవి నిలిచిపోవడంతో ట్రాక్టర్ల నిర్వహణ కోసం స్థానిక పెట్రోల్ బంక్‌లో రూ.40 వేల క్రెడిట్ పెట్టారు. ఈ డబ్బు చెల్లించనిదే డీజిల్ పోయమని చెప్పడంతో గత నాలుగైదు నెలలుగా స్థానిక కార్యదర్శి ఇప్పటికే రూ.80 వేల వరకు భరించి ట్రాక్టర్ నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అనేక చిన్న గ్రామ పంచాయతీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు, మంచి నీటి సరఫరా చేసేందుకు కార్యదర్శులు ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తోంది.
అటవీ ప్రాంతాల్లో కోతులకు ఆహారం దొరక్కపోవడంతో గ్రామాల్లోని చొరబడి దాడులు చేస్తున్నాయని నిపుణులు గుర్తించారు. అటవీ ప్రాంతాల్లోనే పండ్ల మొక్కలను పెంచితే కోతులు గ్రామాల్లోకి రావని ఆలోచన చేసిన జగిత్యాల పూర్వ కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ జిల్లాలో పలు చోట్ల అటవీ ప్రాంతాల్లో 20కి పైగా మంకీఫుడ్ కోర్టులను ఏర్పాటు చేశారు. వంద ఎకరాల అటవీ స్థలాల్లో జామ, నారింజ, సపోట, అల్లనేరుడు, అరటి, తునికి, ఉసిరి, చింత ఇలా అనేక పండ్ల చెట్లను నాటించారు. ఐదారేండ్లలో పండ్ల మొక్కలు చెట్లుగా ఎదిగి పండ్లను ఇస్తాయని అందరూ భావించారు. అందు కోసం అధికారులు శ్రమించారు. మల్యాల, సారంగాపూర్, కల్లెడ, మెట్పల్లి, కొడిమ్యాల ప్రాంతాల్లో మంకీఫుడ్ కోర్టుల్లో మంచి పెరుగుదల కనిపించింది. అయితే, ఇప్పుడు ప్రభుత్వ పట్టింపులేని తనంతో మంకీఫుడ్ కోర్టులన్నీ ఎండిపోయాయి. కల్లెడ శివారులోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మంకీఫుడ్ కోర్టు పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయింది. చెట్లన్నీ ఎండిపోయి నేలకూలిపోయాయి. ఎంతో ఆశగా అటవీ ప్రాంతాన్ని పండ్లమయం చేయాలన్న ఆలోచన నీరుగారిపోయింది.
పెద్దపల్లి మండలం రంగాపూర్ పంచాయతీతోపాటు అనేక గ్రామాలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒక్కో పంచాయతీలో దాదాపు రూ.2 లక్షల నిధులు మాత్రమే ఉన్నాయి. డీజిల్ బిల్లులు పెండింగ్‌లో ఉండగా, హరితహారంలో పెంచిన మొక్కలకు సరిగ్గా నీళ్లు పోయకపోవడంతో ఎండిపోతున్నాయి. పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేకుండా పోయింది. చెత్తా చెదారం రోడ్ల పక్కనే ఉంటున్నది. చిన్న గ్రామ పంచాయతీల్లోని సిబ్బందికి నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదు. నర్సరీలో మొక్కల నిర్వహణ సరిగ్గా లేక ఎండిపోతున్నాయి. పలు గ్రామాల్లో తాజా మాజీ సర్పంచ్‌లు ఖర్చు చేసిన నిధుల బిల్లులు ఇంకా రాలేదు. వచ్చే నెల నుంచి పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వడం కూడా కష్టతరంగా మారనుంది.
జ్యోతినగర్(రామగుండం) మే 19: పంచాయతీలను నిధుల కొరత వేధిస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదునెలల్లోనే పల్లె పాలన అస్తవ్యస్తంగా మారింది. అంతర్గాం మండలం కుందనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్యం పడకేసింది. గ్రామంలోని 13 మంది మల్టీపర్పస్ వర్కర్స్కు మూడు నెలలుగా వేతనాలు రాలేదు. కరెంటు బిల్లులు ఆరు నెలలుగా చెల్లించలేదు. దాదాపు రూ.38వేలు బకాయి ఉంది. ఇటీవల కురిసిన వర్షానికి జీపీలో 47 విద్యుత్ వీధి స్ట్రీట్ లైట్లు చెడిపోవడంతో అత్యవసర సర్వీస్‌గా సొంత ఖర్చులతో రిపేరు చేయించినట్లు కార్యదర్శి వెల్లడించారు. జీపీకి సంబంధించిన ఆస్తి పన్నును వంద శాతం వసూలు చేసి, అభివృద్ధి పనులకు చెక్కులు అందజేసినా సర్కారు నిధులు విడుదల చేయడం లేదని కార్యదర్శి ఆవేదన చెందారు. ఇక గ్రామంలో సీసీ రోడ్లు, మన ఊరు మనబడికి సంబంధించి పనులు పూర్తిచేసినా బిల్లులు రాలేదని సంబంధిత కాంట్రాక్టర్ ఆవేదన చెందారు.
లింగాపూర్‌లో పంచాయతీ కార్మికులకు మూడు నెలలు వేతనాలు ఇవ్వలేదు. పది నెలల కరెంటు బిల్లు రూ.లక్ష బకాయి ఉందని జీపీ కార్యదర్శి పేర్కొన్నారు. నిధుల లేమితో కనీసం హరితహారంలో నాటిన మొక్కలకు నీళ్లు పట్టలేని పరిస్థితి ఉంది. నర్సరీలో నీరు లేక మొక్కలు ఎండిపోతున్నాయి.
ధర్మారం, మే19: ధర్మారం మండలంలోని ధర్మారం, కొత్తపల్లి గ్రామ పంచాయతీలను ‘నమస్తే తెలంగాణ’ విజిట్ చేసింది. ముందుగా ధర్మారం పంచాయతీని సందర్శించగా పలు విషయాలు వెలుగు చూశాయి. గ్రామంలో గత సర్పంచ్ నాలుగు సీసీ రోడ్లు, ఒక డ్రైనేజీ, ఒక బోర్వెల్ వేయించాడు. ఇప్పటికీ అతనికి రూ.8 లక్షల బిల్లులు చెల్లింపు జరుగలేదు. గత మార్చిలో ట్రెజరీకి చెక్కులు పంపించినప్పటికీ ఎన్నికల కోడ్ పేరుతో పెండింగ్‌లో పెట్టారు. ఇక గత సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు పారిశుధ్యం, హరితహారం కోసం వినియోగించిన ట్రాక్టర్‌కు అవసరమైన రూ.2.60 లక్షల విలువైన డీజిల్‌ను పెట్రోల్ బంక్‌ల ద్వారా పంచాయతీ కార్యదర్శి పోయించాడు. ఇప్పటివరకూ బిల్లులు రాలేదు.
కొత్తపల్లి గ్రామంలో నలుగురు పారిశుధ్య కార్యికులు, ఒక ఎలక్ట్రీషియన్‌కు రెండు నెలల నుంచి జీతాలు అందలేదు. దాదాపు రూ.81 వేలు పెండింగ్‌లోనే ఉంది. రోజూవారీ పారిశుధ్య పనుల కోసం వినియోగించిన ట్రాక్టర్‌కు అవసరమైన రూ.43,600 డీడీలను డిజీల్ను పెట్రోల్ బంక్‌ల ద్వారా పంచాయతీ కార్యదర్శి పోయించాడు. ఇప్పటివరకూ బిల్లులు రాలేదు. జీపీలో వాటర్ రెగ్యులేటర్ కార్మికుడు చేసిన వివిధ రకాల పనులకు సంబంధించి రూ.29,500 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. గ్రామంలో నిర్మించిన ఒక సైడ్ డ్రైన్, విద్యుత్ స్తంభాల విస్తరణ పనుల బిల్లు రూ.3లక్షలు పెండింగ్‌లోనే ఉంది. నిర్మించిన సీసీ రోడ్డుకు సంబంధించిన రూ.1.20లక్షల బిల్లు గత సర్పంచ్‌కు రావాల్సి ఉన్నది.