Chigurumadi | చిగురుమామిడి, అక్టోబర్ 3: విజయదశమి పర్వదిన వేడుకలు మండలంలో గురువారం ఘనంగా నిర్వహించారు. చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి, ముల్కనూర్, ఇందుర్తి, ముదిమాణిక్యం, కొండాపూర్, సుందరగిరి తదితర గ్రామాల్లో గ్రామస్తులు డబ్బు చప్పులతో ర్యాలీగా బయలుదేరి జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు జమ్మి ఆకులు అందజేసి ఆత్మీయ అలింగనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఎస్సై సాయికృష్ణ ఆయుధ పూజ నిర్వహించారు. పలు గ్రామాల్లోని దేవాలయాల్లో వాహనాలకు పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళలో పాలపిట్టను చూసేందుకు ఊరి పొలిమేరలకు గ్రామస్తుల తరలి వెళ్లారు.
కానరాని గాంధీ జయంతి వేడుకలు
దసరా పండుగ రోజున గాంధీ జయంతి రావడంతో పలు గ్రామాల్లో యూత్ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు జయంతి వేడుకలకు దూరంగా ఉన్నారు. మండల పరిషత్ కార్యాలయంతో పాటు రేకొండ మిలియన్ యూత్ క్లబ్, చిగురుమామిడి తదితర గ్రామాల్లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. గ్రామాల్లో గాంధీ జయంతి రోజున మద్యం, మాంసం పై ఆంక్షలు ఉన్నప్పటికీ పలు గ్రామాల్లో అమ్మకాలు జరిగాయి. సమాచారం తెలుసుకున్న ఎస్సై సాయికృష్ణ రేకొండ, బొమ్మనపల్లి, సుందరగిరి, నవాబ్ పేట్, ముల్కనూర్, ఇందుర్తి గ్రామాల్లో పెట్రోల్ నిర్వహించి షాపులను మూసి వేయించారు. గాంధీజయంతి రోజున అమ్మకాలు జరిపితే కఠిన చర్చలు తప్పవని హెచ్చరించారు. మద్యం ప్రియులు ముందు రోజే మద్యం ను కొనుగోలు చేసి జాగ్రత్తలు తీసుకున్నారు.
గాంధీ జయంతి రోజున బెల్ట్ షాపుల హవా..
చిగురుమామిడి మండలంలో గాంధీ జయంతి రోజున మద్యం అమ్మకాలు నిషేధం ఉన్నప్పటికీ పలు గ్రామాల్లోని బెల్ట్ షాపులలో విక్రయాలు జోరుగా జరిగాయి. తెలిసినవారు రహస్యంగా బెల్ట్ షాపుల్లో మద్యం తీసుకొని వెళ్లారు. అన్నీ తెలిసిన అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరించారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిబంధనలు బేకార్ చేస్తూ ధనార్ధనే ధ్యేయంగా దర్జాగా బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాలు జరిగాయని పలువురు అభిప్రాయపడ్డారు. బెల్ట్ షాపులో మద్యం అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అధికారులపై ఉందని మండల ప్రజలు కోరుతున్నారు.