మల్యాల, జూన్ 5 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధానంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 వరకు రికార్డులను పరిశీలించి, పలు వ్యవహారాలపై ఆరా తీశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల ప్రకారం సీఐ ప్రశాంత్‌రావు నేతృత్వంలో ఓ బృందం కొండగట్టు ఆలయానికి వచ్చి, ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలో లడ్డూ, పులిహోర ప్రసాదాల తయారీకి సంబంధించిన తూకం వివరాలు, ప్రసాదాలను వినియోగించే ముడి సరుకుల నాణ్యతా ప్రమాణాలు, స్టాక్, రికార్డుల నిర్వహణను పరిశీలించారు.
ఆ తర్వాత గత మూడేళ్లకు సంబంధించిన ముడిసరుకుల సరఫరాదారుల వివరాలు, అప్పటి వినియోగం, ధరలపై ఆరా తీశారు. అనంతరం ఆలయ కార్యాలయ భవనానికి విజిలెన్స్ అధికారులు చేరుకోగా ఈవో శ్రీకాంతరావు హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి వెళ్లగా, అందుబాటులో ఉన్న ఆలయ పర్యవేక్షకుడు నీల చంద్రశేఖర్‌ను పలు రికార్డుల వివరాలు అడిగారు.
ఈ నేపథ్యంలోనే 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు భక్తులు సమర్పించిన తలనీలాలు పోగు చేసుకునే హక్కు, భక్తులకు అవసరమయ్యే వస్తువులు విక్రయించే దుకాణాలకు సంబంధించిన టెండర్లు, ఈవో చేసుకున్న అగ్రిమెంట్ల వివరాలను పరిశీలించారు. దీంతోపాటు పూర్తిస్థాయి రికార్డులను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. గతంలో ఆలయంలో జరిగిన చోరీపై ఆరా తీయడంతోపాటు పోయిన వెండి వస్తువుల తూకం ఎంత? ఎంత రికవరీ చేశారు? అనే వివరాలు తెలుసుకున్నారు.
రికవరీ తర్వాత కూడా అప్పటి ఈవో వెంకటేశం మళ్లీ వెండిని రికవరీ చేయాలని మల్యాల పోలీసులకు మరో పిటిషన్ ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అనంతరం సీఐ ప్రశాంత్‌రావు మాట్లాడుతూ, విజిలెన్స్ అధికారుల సోదాలు నిరంతరంగా సాగుతాయని, మరోసారి అంజన్న ఆలయానికి వస్తామని, రికార్డులను అందుబాటులో ఉంచాలని ఆలయ సిబ్బందికి సూచించారు. కాగా, విజిలెన్స్ అధికారులు సోదాలు చేయడంతో గతంలో అవినీతికి పాల్పడిన సిబ్బందితోపాటు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతూ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగుల గుండెల్లో గుబులు మొదలైంది.