Vemulawada | వేములవాడ, జనవరి 20: వేములవాడ రాజన్న ఆలయంలోని అవుట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది వ్యవహారంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం రాజన్న ఆలయంలో తనిఖీలు నిర్వహించారు. ఇటీవల బాసర ఆలయంలో అవుట్సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న సిబ్బంది జీతభత్యాలు హాజరు వ్యవహారంలో భారీగా అవకతవకలను గుర్తించగా ఈ నేపథ్యంలోనే వేములవాడ రాజన్న ఆలయంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. సుమారు ఐదు గంటల పాటు అధికారులు సంబంధిత ఔట్సోర్సింగ్ విభాగం రికార్డులు, హాజరు విధానం, చెల్లిస్తున్న జీతభత్యాల రికార్డులను విజిలెన్స్ బృందం పరిశీలించింది.
రాజన్న ఆలయంలో 226 మంది..
వేములవాడ రాజన్న ఆలయంలో లడ్డు తయారీ, విక్రయాలు, శానిటేషన్ నిర్వహణ, హౌస్ కీపింగ్, ఇంజనీరింగ్ విభాగాలలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన సిబ్బంది రెండు వందల ఇరవై ఆరు మంది పనిచేస్తున్నట్లు గుర్తించారు. వీరి హాజరు విధానం, రోజువారి పనితీరు, ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో సంబంధిత రికార్డులు, నెలవారి జీతభత్యాలపై పూర్తిస్థాయిలో అధికారుల బృందం విచారణ జరిపింది. సుమారు 5 గంటల పాటు అన్ని రికార్డులను విజిలెన్స్ అధికారులు అనిల్ కుమార్, వరుణ్, దినేష్ రెడ్డిలతో కూడిన బృందం పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.