పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తి కోసం కాల్చిన బొగ్గు నుంచి వచ్చిన బూడిద ఓవర్ లోడ్‌తో అక్రమంగా తరలి వెళుతున్నదని నమస్తే తెలంగాణలో వరుసగా ప్రచురితమవుతున్న కథనాలపై విజిలెన్స్ అధికారులు స్పందించారు. పెద్దపల్లి జిల్లా నుంచి తరలి వెళుతున్న ఓవర్ లోడ్ బూడిద లారీలను పెద్ద ఎత్తున పట్టుకున్నారు. పరిమితికి మించి ఓవర్ లోడ్ తో వెళ్లడంతోపాటు రోడ్ ట్రాన్స్పోర్ట్ నిబంధనలకు నడుపుతున్న వాహనాలపై నిఘా విధించారు.
జిల్లాలో రెండు రోజులుగా 35 వాహనాల తనిఖీ చేసి జరిమానాలు విధించినట్లు పెద్దపల్లి ఆర్టీవో రంగారావు తెలిపారు. బూడిద రవాణా విషయాల్లో వాహనదారులు ఓవర్ లోడ్‌తో పాటు ఫిట్ నెస్ లేని వాహనం సైతం నడుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. చాలా లారీలకు వెనుకవైపు ఎలాంటి నంబర్లు లేకుండానే లారీలను నడిపిస్తున్నారని తెలిపారు. ఓవర్ లోడ్‌తో వెళ్తున్న ఈ వాహనాలను పట్టుకున్న తర్వాత చాలామంది డ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్సులు కూడా లేవని తేలుతుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు నడుపుతున్న వారిపై జరిమానాలను విధిస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం విజిలెన్స్ తనిఖీల్లో ఈ సురేష్ కుమార్, ఏం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.