జగిత్యాల, నవంబర్ 10 : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ లు అమలు చేయకుండా.. ప్రతిపక్షాలను తిట్టడమే ముఖ్యమంత్రి పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటీవల మూసీ పాదయాత్ర సందర్భంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
ఈ మేరకు ఆదివారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ, ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టంవచ్చినట్లు మాట్లాడడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు.
మూసీ ప్రక్షాళన ఎవరూ వద్దంటలేరని.. అకడ ఉండేవారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధుకు దికులేదు గానీ మూసీ సుందరీకరణకు రూ.లక్షాయాభై వేల కోట్లు ఎక్కడి నుంచి తేస్తారని ప్రశ్నించారు. జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి అయ్యాడంటే అది కేసీఆర్ పెట్టిన భిక్షేనన్నారు.
మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. తర్వాత పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో జగిత్యాల బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, ఏఎంసీ మాజీ చైర్పర్సన్ శీలం ప్రియాంక, జగిత్యాల రూరల్, అర్బన్, సారంగాపూర్, రాయికల్ మండలాల పార్టీ అధ్యక్షులు ఆయిల్నేని ఆనంద్‌రావు, తుమ్మ గంగాధర్, తేలు రాజు, బర్కం మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.