వేములవాడ/ వేములవాడ టౌన్ నవంబర్ 12: పేదల దేవుడిగా పేరుగాంచిన ఎములాడ రాజన్నను ఇన్నాళ్లూ నేరుగా దర్శించుకున్న భక్తులకు ఇకపై నిరాశే మిగలనున్నది. దర్శనాల విషయంలో కొద్ది నెలల నుంచి గందరగోళానికి తెరలేపిన అధికారులు, చివరకు రాత్రికి రాత్రే బంద్ చేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. అభివృద్ధి పేరిట ఆంక్షలు పెట్టకుండా.. దర్శనాలు కల్పిస్తూనే పనులు సాగించాలన్న డిమాండ్ అన్ని వర్గాల నుంచి బలంగా వ్యక్తమైనా లెక్కచేయకపోవడంపై ఆగ్రహం కనిపిస్తున్నది. రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులు నడుస్తున్నాయని, కోడె మొక్కు, ఇతర ఆర్జిత సేవలు భీమేశ్వరాలయంలో జరుగుతున్నాయని, అందుకు భక్తులు సహకరించాలని ఆలయ అధికారులు బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.
అంతేకాకుండా ఆలయ పరిసరాల్లో ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక సారలమ్మ జాతర జనవరిలో ఉండగా, భక్తులకు దర్శనాలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. రాజన్న దర్శనం తర్వాతే సమ్మక జాతరకు వెళ్లే ఆనవాయితీ ఉన్నది. సుమారు కోటి మందికి పైగా స్వామివారిని దర్శించుకునే అవకాశమున్నది. రెండు నెలల ముందు నుంచే భక్తుల రాక మొదలవుతుంది. ఇలాంటి సమయంలో రాత్రికి రాత్రే భారీ పోలీసు బందోబస్తు మధ్యన ప్రధాన ఆలయ గేటుతోపాటు ఇతర ప్రాంతాల్లో భారీ రేకులతో కంచె ఏర్పాటు చేసి ఆలయాన్ని మూసివేశారు.
అయితే ముందస్తుగా ఎలాంటి ప్రకటన చేయకుండా, గుట్టుగా మంగళవారం అర్ధరాత్రే ఆలయాన్ని మూసివేయడంపై భక్తులు మండిపడుతున్నారు. బుధవారం ఉదయం స్వామి వారి మొకులు చెల్లించుకునేందుకు వచ్చిన భక్తులు తీవ్ర నిరాశ చెందారు. పడమటి ద్వారం, ప్రధాన రహదారి వద్ద ఉన్న మెట్ల వద్ద కొబ్బరికాయలు కొట్టి, తమ మొకులు చెల్లించుకున్నారు. ఇక తలనీలాలు సమర్పించుకున్న భక్తులు కూడా రాజన్నకు మొకులు చెల్లించుకునేందుకు ముప్పు తిప్పలు పడ్డారు. తలనీలాలను రావి చెట్టు వద్ద వేద్దామని అనుకున్నప్పటికీ, అకడికి అనుమతించకపోవడంతో చివరికి ఆలయ గేట్ల వద్దకు చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు.

ప్రచార రథంలో ప్రతిమలు.. ఎల్ఈడీ స్రీన్లో పూజలు
భక్తులు ఇక ప్రధాన ఆలయం ముందున్న రావిచెట్టు వద్ద ఏర్పాటు చేసిన ప్రచార రథంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీరాజరాజేశ్వరి దేవి, లక్ష్మీ గణపతి అమ్మవార్ల ప్రతిమల వద్ద మొకులు చెల్లించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇకడికి చేరుకోవడానికి రాజన్న ఆలయ గుడి చెరువు నుంచి, జగిత్యాల బస్టాండ్ నుంచి కూడా వచ్చేందుకు భారీ క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అర్చకులకు విధులు కేటాయించడంతోపాటు అకడికి చేరుకునే భక్తులకు బొట్టు, తీర్థం, ప్రసాదం అందిస్తున్నారు. ఇక ఎల్ఈడీ స్రీన్ ద్వారా రాజన్న గర్భాలయం వద్ద జరుగుతున్న పూజలు, స్వామి వారి చిత్రాలను ప్రదర్శిస్తూ దర్శనాలు కల్పించారు. క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకునే మార్గాలపై స్పష్టత ఇవ్వడంలో అధికారులు విఫలమయ్యారని భక్తులు మండిపడుతున్నారు.
గుర్తింపు కార్డులు ఉన్న వారికే అనుమతి
రాజన్న ఆలయంలోని ప్రధానాలయానికి వచ్చే అర్చకులు, ఇతర సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేయనున్నారు. ప్రత్యేక గుర్తింపు కార్డు కలిగి ఉన్న అర్చకులు, ఉద్యోగులు మాత్రమే ఇక ప్రధానాలయంలోకి వెళ్లేందుకు భద్రతా సిబ్బంది అనుమతించనున్నారు. అందుకు ప్రత్యేక గుర్తింపు కార్డులను కూడా ఆలయ అధికారులు సిద్ధం చేశారు.