మేడిపల్లి, నవంబర్ 20: ‘ నేను మీ సేవకుడిని. సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తో మీ ముందుకు వచ్చా. ఆశీర్వదించండి. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో మరింత అభివృద్ధి చేస్తా. ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీ కోసం పనిచేస్తానని’ వేములవాడ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు ప్రజలకు పిలుపునిచ్చారు. భీమారం మండలం మన్నెగూడెం, మేడిపల్లి మండ లం దమ్మన్నపేట, కల్వకోట, మాచాపూర్ గ్రామాల్లో సోమవారం రోడ్ షో, ఎన్నికల ప్రచారం చేపట్టగా, మహిళలు బోనాలు, బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహారావు మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అంది స్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంత అభివృద్ధిని విస్మరించడంతో ప్రజలు అనేక సమస్యలతో సతమతమయ్యారన్నారు.
కోట్లాడి సాధించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదిన్నరేండ్లలో ఏ విధంగా అభివృద్ధి చెందిందో.. ప్రజలు ఆలోచన చేయాలన్నారు. రైతులకు పెట్టుబడి సాయం, రైతు బంధు, నాణ్యమైన కరెంట్తోపాటు రైతు బీమా పథకం ద్వారా రూ.5 లక్షలు అందజేసి రైతు కుటుంబానికి భరోసా కల్పించారని పేర్కొన్నారు. గ్రామంలోని అర్హులైన వారందరికీ పెన్షన్లు అందాలనే ఉద్దేశ్యంతో తెలుపు కార్డు ఉన్న యజమానికి సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా నెలకు రూ.3వేల జీవన భృతి ఇస్తామని, కేసీఆర్ బీమా ద్వారా రూ.5 లక్షలు అందించనున్నారని తెలిపారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు సాయం చేసేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచారన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలోని బీడు భూములు సస్యశ్యామలం చేశారన్నారు. అందరి గురించి ఆలోచన చేసే కేసీఆర్నుమూడోసారి ముఖ్యమంత్రి చేయాలని తెలిపారు. మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ మాట్లాడుతూ 60ఏండ్ల కాంగ్రెస్ పాలనలో మన బతుకుల్లో మార్పు వచ్చిందా..? అని ప్రశ్నించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రెండు పంటలు పండించుకుంటూ సుఖసంతోషాలతో ఉన్నారన్నారు. కొట్లాడి తెలంగాణ తెచ్చిన, ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మన్నెగూడెం గ్రామానికి చెందిన కల్లెడ శంకర్, కల్వకోటకు చెందిన 20 మంది యువకులు, వల్లంపల్లి గ్రామానికి చెందిన హిందు సేనా యూత్, వయోలైన్స్ యూత్, పెరుక సంఘం అధ్యక్షుడు, సభ్యులు 70 మంది బీఆర్ఎస్లో చేరారు.