కోనరావుపేట, అక్టోబర్ 26: అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో అరిగోస పడ్డామని, మళ్లీ ఆ రోజులు రావద్దని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు గుర్తు చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దొంగల పాలుజేయద్దని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. గురువారం కోనరావుపేట మండలంలోని మామిడిపల్లి, బావుసాయిపేట, గోవిందరావుపేట తండా, వట్టిమల్ల, గొల్లపల్లి, కమ్మరిపేట తండా, భూక్యరెడ్డి తండా, మరిమడ్ల, అజ్మీరతండా, కొండాపూర్‌లో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, స్థానిక నేతలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
ఈసందర్భంగా మహిళలు, యువకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారానికి తరలివచ్చి అడుగడుగునా చల్మెడకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి చల్మెడ మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని చెప్పారు. కానీ 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ హయాంలో నీళ్లు, కరెంటు లేక అష్టకష్టాలు పడ్డామని వాపోయారు. రాత్రి పొలం కాడికి మోటరు పెట్టడానికి పోతే కరెంట్ ఎప్పుడు వచ్చేదో, ఎప్పుడు పోయేదో తెలువకపోయేదని గుర్తు చేశారు. అలా కరెంట్ కాడికి పోయి ఎందరో రైతులు కరెంట్ షాక్‌తో మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి గోసలు లేకుండా సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చి రైతులను ఆదుకుంటున్నారని స్పష్టం చేశారు.
అంతేకాకుండా రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మితో పాటు మరెన్నో పథకాలు అడగకుండానే ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అలాగే మ్యానిఫెస్టోలో కూడా అన్నపూర్ణ పథకంతో సన్న బియ్యం. ఇంటింటా సౌభాగ్యలక్ష్మి, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి బీమాలాంటి పథకాలు ప్రతి పేదవారికి చేరేలా హామీ ఇచ్చారన్నారు. కావున కాంగ్రెసొళ్లు చెప్పే కళ్లబొల్లి మాటలు నమ్మకుండా ఆలోచించి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఇచ్చిన గ్యారెంటీలు ఒక్కటీ కూడా అమలు కాలేదని, మనకు అలాంటి గతి రాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌తోనే ఉద్యోగాలు సాధ్యమని, యువత కూడా ఇది గమనించాలని తెలిపారు. అనంతరం ఆయా గ్రామాల్లో ప్రజల సమస్యలను చల్మెడ ఓపికగా వింటూ పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రతి పల్లెలో యువకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని గమనించిన యువకులు హస్తం పార్టీని వీడి గులాబీ కండువా కప్పుకుంటున్నారు. మామిడిపల్లిలో జానీ యువసేన యూత్ సభ్యులు 40మంది వరకు ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు సమక్షంలో కారెక్కారు. అలాగే వట్టిమల్ల, గొల్లపల్లికి చెందిన 20 మంది యువకులు, నేతలు బీఆర్ఎస్లో చేరారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, జిల్లా సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, మార్కెఫెడ్ డైరెక్టర్ బండ నర్సయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గోపు పరశురాములు, పార్టీ మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య, రైతు బంధు కమిటీ మండలాధ్యక్షుడు గోగు ప్రతాపరెడ్డి, సర్పంచ్ కొక్కుల భారతి, గంగాధర్, స్వప్న, సూర్య లకావత్ ప్రమీల, మాట్ల అశోక్, దివ్య, యువజన విభాగం మండలాధ్యక్షుడు ముష్నం జీవన్‌గౌడ్, సీనియర్ నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, ఉపసర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.