వేములవాడ, మార్చి 12: ఉమ్మడి రాష్ట్రంలో 42ఏండ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో ఏ ఒక సాగునీటి ప్రాజెక్టు కూడా నిర్మించలేదని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కరువు అని ప్రజలకు మరోసారి తెలిసేలా పాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చిల్లర రాజకీయాలతో పంటలకు నీరివ్వకుండా చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజా క్షేత్రంలో గెలిచి బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా అక్రమ కేసులతో వేధించినా.. కక్షసాధింపు చర్యలకు దిగినా సహించేదిలేదని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటామని, అన్ని వేళలా అండగా నిలుస్తామని భరోసానిచ్చారు.
వేములవాడలోని తన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాక్షాత్తూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అప్పర్ మానేరు వద్ద పైలాన్ ఆవిషరించి.. నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మించి సస్యశ్యామలం చేస్తామని చెప్పినా పూర్తి చేయలేదన్నారు. 2008లో మధ్యమానేరు ప్రాజెక్టును ఇద్దరు కాంట్రాక్టర్లు 838కోట్ల పనులు మాత్రమే చేసి మధ్యలోనే వదిలేసిన విషయం మరిచిపోయారా? అని ప్రశ్నించారు. 2019లో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 1,587 కోట్లతో మధ్యమానేరు ప్రాజెక్టును పూర్తి చేయడమే కాకుండా.. తెలంగాణ మొత్తానికి గుండెకాయలాగా తీర్చిదిద్దారని కొనియాడారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ మానేరువాగుపై11, మూలవాగుపై 13చెక్‌డ్యాంలు నిర్మించారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సిరిసిల్ల డివిజన్లోని 9మండలాలు ప్రతిసారి కరువు మండలాలుగా ఉండేవన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2014 కంటే ముందు 57,300 ఎకరాలలో వరి పండిస్తే, రాష్ట్రం వచ్చిన తర్వాత 1,77, 370 ఎకరాలు సాగులోకి వచ్చాయని చెప్పారు. 2006 నుంచి 2014 వరకు అధికారంలో ఉండి ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించకుండా జఠిలం చేస్తే.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిషరించి పనులు పూర్తి చేశామన్నారు. విప్ ఆది శ్రీనివాస్‌కు నిర్వాసితులపై చిత్తశుద్ధి ఉంటే 5.4లక్షల హామీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఇందిరమ్మ ఇండ్ల పేరిట జీవో విడుదల చేసి చేతులు దులుపుకొన్నారని ఆరోపించారు.
మల్కపేట ప్రాజెక్టును పూర్తి చేసినం
2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నీటిపారుదలశాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి 0.35టీఎంసీతో మల్కపేట ప్రాజెక్టు నిర్మాణానికి, సొరంగం పనులకు శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో మల్కపేట ప్రాజెక్టును మూడు టీఎంసీల ప్రాజెక్టుగా రూపుదిద్ది పనులు పూర్తి చేశారని, అందులో ఒక టీఎంసీని కూడా నీటిని ఎత్తిపోశారని గుర్తు చేశారు. అలాంటి ప్రాజెక్టులో కనీసం వానకాలమైనా రెండో టీఎంసీ నీటిని నింపాలన్న అవగాహన లేకుండా ఎమ్మెల్యే కేవలం ఫొటోలకు మాత్రమే పరిమితమై.. నీటిని నింపినట్టు ప్రజలు నమ్మించడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ఈ ప్రాంత రైతుల పొలాలకు నీరివ్వకుంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తే నీటిని విడుదల చేశారని చెప్పారు.
రైతులను మభ్యపెడుతున్నరు
ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజీ 2, ఫేస్ 1 పనులు బీఆర్ఎస్ హయాంలోనే 95శాతం పూర్తయ్యాయని చల్మెడ పేర్కొన్నారు. సూరమ్మ ప్రాజెక్టు పనులను తానే ప్రారంభించినట్టు ఆది శ్రీనివాస్ కొబ్బరికాయలు కొట్టి.. ఫొటోలకు ఫోజులిస్తూ రైతులు, ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కుడి, ఎడమ కాలువ నిర్మాణాలకు 1,800 ఎకరాల భూ సేకరణ చేసి 176కోట్లతో కాలువ పనులు పూర్తి చేస్తేనే 43,100ఎకరాలకు సాగునీరు అందుతుందని, లేదంటే సూరమ్మ ప్రాజెక్టు మాత్రమే పూర్తయితే కేవలం 4,500ఎకరాలకు సాగునీరందుతున్న విషయాన్ని చెప్పకుండా మభ్యపెడుతున్నారని విమర్శించారు. నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే వరద కాలువ ద్వారా రుద్రంగి సూరమ్మ ట్యాంకును నింపేందుకు 536.5 కోట్లతో కూడిన ప్రాజెక్ట్ అనుమతులతోపాటు నిధులు తేవాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే ఈ ప్రాంత ప్రజల, రైతుల పక్షానా ఆది శ్రీనివాస్‌ను సన్మానిస్తామని స్పష్టంచేశారు.
కోట్లాది రూపాయలతో వేములవాడ అభివృద్ధి
వేములవాడ అభివృద్ధిలో వెనుకబడిందన్న విప్ వ్యాఖ్యలను చల్మెడ తీవ్రంగా ఖండించారు. తొమ్మిదిన్నర ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో వేములవాడ పట్టణం, రాజన్న గుడి అభివృద్ధికి వందల కోట్ల రూపాయలు కేటాయించామని గుర్తు చేశారు. 200 కోట్లకు పైగా నిధులతో రాజన్న ఆలయం, పరిసర రహదారులు, గుడి చెరువు, ఆలయ అభివృద్ధికి స్థల సేకరణకు కేటాయించామన్నారు. వేములవాడ పురపాలక సంఘాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినా.. అవి కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 50ఏండ్లలో జరుగని అభివృద్ధిని, తొమ్మిదిన్నర ఏండ్ల కేసీఆర్ పాలనలో ప్రజలకు అందాయని గుర్తు చేశారు. విమర్శించేముందు స్థాయిని తెలుసుకొని జరిగిన అభివృద్ధి పై మాట్లాడాలన్నారు. కల్లబొల్లి మాటలతో కాలం వెల్లదీస్తున్నారని, ప్రజాక్షేత్రంలో ప్రజలు అన్ని గమనిస్తున్నారని స్పష్టంచేశారు.
రాజన్న గుడికి రూపాయి అయిన వచ్చాయా..
రాజన్న ఆలయ అభివృద్ధి పేరిట నవంబర్ 20న సాక్షాత్తూ సీఎం రేవంత్‌రెడ్డి వచ్చి శిలాఫలకాలు వేశారని గుర్తుచేశారు. 76కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పిన సీఎం.. దాదాపు వంద రోజులు దాటుతున్న ఒక రూపాయి కూడా రాలేదని విమర్శించారు. అసలు అభివృద్ధి పనులకు నిధులు తెచ్చి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని విమర్శించారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, మాజీ ఎంపీపీలు చంద్రయ్యగౌడ్, గంగం స్వరూప, రుద్రంగి సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతికుమార్, మండల పార్టీ అధ్యక్షులు గోసుల రవి, మ్యాకల ఎల్లయ్య, మల్యాల దేవయ్య, సత్తిరెడ్డి, నాయకులు కిరణ్, రవికుమార్, నిమ్మ శెట్టి విజయ్, గోలి మహేశ్, సిరిగిరి రామ్ చందర్, కటకం మల్లేశం, ఏశ తిరుపతి, చిలుక పెంటయ్య, వెంగల శ్రీకాంత్ గౌడ్, వెంకట్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.