వేములవాడలోని భీమేశ్వర ఆలయంలో రాజన్న భక్తులకు వసతులు కల్పించడంలో అలసత్వం కనిపిస్తున్నది. ముందుచూపు లేని పనులతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. అడుగడుగునా ప్రణాళికాలోపంతో చేసిన పనులే మళ్లీ చేస్తున్నారనే విమర్శలు వస్తుండగా, నాలుగు నెలలైనా పనులు పూర్తి కావడం లేదని తెలుస్తున్నది. ఓవైపు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నా.. మరోవైపు కొనసాగుతుండడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది.
వేములవాడ/ వేములవాడటౌన్, డిసెంబర్ 24 : వేములవాడ రాజన్న భక్తులు తిప్పలు పడుతున్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు కల్పిస్తుండగా, అవసరాలకు తగ్గట్టు వసతులు.. సరైన సేవలు అందక అవస్థలు పడుతున్నారు. జూలై 20న 3.44 కోట్లతో ఎనిమిది పనులు ప్రారంభించిన అధికారులు, ఆ తర్వాత వాటిని 69పనులతో 5కోట్ల 30లక్షలతో అంచనాలు పెంచారు. సెప్టెంబర్ నుంచి పూర్తిస్థాయిలో పనులు ప్రారంభించి నాలుగు నెలలు గడుస్తున్నా ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ముందు చూపు లేక మూడు అడుగులు ముందుకి నాలుగు అడుగులు వెనకి అన్న చందంగా పరిస్థితి తయారైంది. అందులో 30కి పైగా పనులు పూర్తయ్యాయని, మిగతావి కాంట్రాక్టు ఒప్పందాలు పూర్తి చేసుకోగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు
భీమేశ్వరాలయంలో భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లలో ముందు చూపులేని పనులు అధికార నిర్లక్ష్యానికి అద్దంపడుతున్నాయి. వేద పాఠశాలలో భక్తులకు ముఖ్య బుకింగ్‌తో పాటు ప్రసాదాల విక్రయాలు, తయారీ చేపట్టాలని భావించి, అందుకు అనుగుణంగా పనులు చేశారు. స్వామివారి ఆర్జితసేవలైన నిత్య కల్యాణం టికెట్ల కోసం గత కార్తీకమాసంలో భక్తులు గొడవకు దిగగా, కౌంటర్లు సైతం విరిగిపోయాయి. దీంతో తాము ఇకడ పనిచేయలేమని ఉద్యోగులు అధికారులకు మొరపెట్టుకుంటే మళ్లీ ఆ కౌంటర్‌ను ప్రచార రథం షెడ్డుల్లోకి మార్చారు. ఇక ప్రస్తుతం ఉన్న ప్రసాద విక్రయ శాలలో కనీసం ప్రసాదాలు నిలువ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ప్రసాదాన్ని విక్రయశాల పకనే తయారు చేసేందుకు ఏర్పాట్లు చేయగా, అగ్నిమాపక శాఖ అధికారులు తీవ్ర అభ్యంతరం చెప్పడంతో మళ్లీ వెనకి తగ్గారు.
గతంలో బాయిలర్ పేలుళ్లు తదితర అంశాలను పేరొంటూ నివాసాల మధ్య ప్రసాదాల తయారీ ప్రమాదకరమని తేల్చడంతో ప్రస్తుతానికి దానిని స్వామి వారి నిత్య కల్యాణం కోసం శంకర్మట్లో నిర్మిస్తున్న మండపానికి మార్చాల్సిందిగా ప్రతిపాదించారు. ఇదిలా ఉంటే రాజన్న కల్యాణానికి సంబంధించి గతంలో 150 నుంచి 200 టికెట్లను రద్దీకి అనుగుణంగా జారీ చేసేవారు. ప్రస్తుతం పార్వతీపురం అన్నదాన సత్రంపై అంతస్తులో నిత్య కల్యాణం నిర్వహిస్తుండం, స్థలం తకువగా ఉండడంతో టికెట్ల సంఖ్యను 80కి కుదించారు. అయితే నిత్య కల్యాణానికి ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఎలాంటి ముందస్తు చర్యలు చేపడుతారో..? తెలియజేయాల్సి ఉన్నది. ఇక రాజన్న కోడె మొక్కులకు సంబంధించి టికెట్ కౌంటర్ భీమేశ్వరాలయంలో ఏర్పాటు చేయడంతో కౌంటర్లో పనిచేసే ఉద్యోగులకు ఇబ్బంది పడుతున్నారు. ఒక వైపు స్వామి వారి ప్రసాదాన్ని కోడె భక్తులకు ఉచితంగా అందజేసే విధానం ఉంది. అయితే అందుకు సంబంధించిన కౌంటర్లో కూర్చోవడానికి వీలు లేకుండా ఉండడంతో ఇలా అయితే ఉద్యోగులు విధులు నిర్వహించలేమని వాపోతున్నారు.

ఈ నేపథ్యంలో కోడె టికెట్లు, సరిపడా ప్రసాదాన్ని నిల్వ ఉంచేందుకు ప్రస్తుతం పార్వతీపురంలోని మూడో నంబర్ గదిని ప్రత్యేక టికెట్ కౌంటర్‌గా మార్చేందుకు మళ్లీ దిద్దుబాటు చర్యలకు దిగారు. స్వామివారికి తలనీలాలు సమర్పించుకునే మొకును అత్యంత పవిత్రంగా భావిస్తారు. అయితే కల్యాణకట్ట ఏర్పాటు, స్వామివారికి మొకులు చెల్లించాక స్నానానికి, బట్టలు మార్చుకునేందుకు చేయాల్సిన ఏర్పాట్లు ముందస్తుగా అంచనాలు రూపొందించక పోవడంతో దిద్దుబాటు చర్యలో భాగంగా తొలగించిన రాజేశ్వరపురం వసతి గదుల సముదాయం వద్ద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు షవర్లు, బట్టలు మార్చుకునే గదులు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. అయితే పనులు పూర్తయ్యాయని ఒకవైపు అధికారులు చెబుతున్నా, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. భక్తుల క్యూ కాంప్లెక్స్‌ను పొడిగించిన నేపథ్యంలో భీమేశ్వర ఆలయం ఎదుట రేకుల షెడ్డు పొడిగింపు పనులు మళ్లీ ప్రారంభించారు. ఇదిలా ఉంటే పార్వతీపురం అన్నదాన సత్రాన్ని ఆనుకొని టెండర్లు దకించుకునే కాంట్రాక్టర్ల కోసం ఆలయ అధికారులు పలు దుకాణాలు నిర్మిస్తున్నారు. నిర్మాణ పనుల్లో భాగంగా ఇనుప వస్తువులు చిందరవందరగా పడేయడంతో భక్తులు నడిచేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
రాజన్న ఆలయంలో త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలు ఏటా జనవరిలో ఐదు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. గతంలో రాజన్న ఆలయంలోని ఓపెన్ స్లాబ్‌పై జరిగేవి. ప్రస్తుతం ఎకడ నిర్వహించాలన్నది ఇంతవరకు నిర్ణయించలేదు. మరోవైపు ఈ నెల 30న ముకోటి ఏకాదశి వేడుకలు నిర్వహించాల్సి ఉండగా, భీమేశ్వర ఆలయంలో నిర్వహిస్తారా..? లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే కార్తీకమాసం దీపోత్సవం వేడుకల నిర్వహణకు ముందస్తు ప్లాన్ లేక భక్తులు ఇబ్బందులను పడుతున్నారు. ముందస్తు ఏర్పాట్లలో భాగంగా వేడుకలపై ప్రణాళిక లేకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు.

భక్తుల అవసరాలకు అనుగుణంగా అంచనాలు రూపొందిస్తూ ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడా ఇబ్బందులు రావద్దనే ఉన్నతాధికారుల సూచనల మేరకు మార్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. దాదాపు పనులన్నీ పూర్తి చేశాం. మిగిలిన వాటిని వేగవంతంగా పూర్తి చేసేందుకు నిరంతరం పనిచేస్తున్నాం. సమ్మక భక్తులకు కావలసిన ఏర్పాట్లను చేస్తున్నాం.