double doctorate | వీర్నపల్లి , ఏప్రిల్ 11: మండల కేంద్రానికి చెందిన సామల్ల సావిత్రి హన్మయ్యల కుమారుడు సామల్ల కృష్ణ ఇంజినీరింగ్ లో డబుల్ డాక్టరేట్ పొందాడు. పదకొండేళ్ల కిందట కాకినాడ జేఎన్టీయూ లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ లో శబ్ద తరంగాల అలజడి లో జరిగే వెయ్యో వంతు శబ్దాన్ని పసిగట్టే అల్గోరిథంను రూపొందించాడు.
ఈ పరిశోధనతో సిగ్నల్ ట్రాన్స్మిషన్ లో పెను మెరుపులకు దారితీయగా డాక్టరేట్ పొందాడు.అయితే సహజంగానే వృత్తి విద్యలో అపార అనుభవమున్న కృష్ణ తన పరిశోధనల్ని మరో పీహెచ్డీ వైపు మళ్లించాడు. డాక్టర్ పెరుమాళ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లో స్పూఫింగ్ మాఫియా(స్పూఫింగ్ అంటే తెలియని మూలం నుండి వచ్చిన కమ్యూనికేషన్‌ను తెలిసిన, విశ్వసనీయ మూలం నుండి వచ్చినట్లుగా దాచిపెట్టడం) పైన పరిశోధన చేశారు.
తన ప్రతిభను గుర్తించిన చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ మరో డాక్టరేట్ అవార్డు ప్రదానం చేసింది. డబుల్ డాక్టరేట్ పొందిన కృష్ణను యూనివర్సిటీ అధికారులు , పలువురు విద్యావేత్తలు అభినందించారు.తన ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధనని తల్లితండ్రులకు అంకితం ఇస్తున్నట్లు కృష్ణ వెల్లడించారు.