రాయికల్, సెప్టెంబర్ 17: గత 15 రోజుల నుండి త్రాగునీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాయికల్ మండలం వీరాపూర్ గ్రామ మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు.
మండలంలోని వీరాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద బిందెలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 15 రోజులుగా నల్లా నీరు రాకపోవడంతో దగ్గరలో ఉన్న వ్యవసాయ బావులు, వాడుకలలో లేని చేత బావులు నుండి నీరు తెచ్చుకొని త్రాగడంతో విష జ్వరాలు వస్తున్నాయని, అధికారులకు నాయకులకు పలుమార్లు విన్నవించుకున్న ఎలాంటి స్పందన లేదని, నీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారిపై నిలబడి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి అధికారులు నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిందెలతో నిరసన తెలిపారు. వెంటనే అధికారులు, నాయకులు స్పందించి త్రాగునీరు అందించాలని, లేనిచో గంటల తరబడి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న అధికారులు తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు.