పెద్దపల్లి జంక్షన్, మార్చి 16: జిల్లాలో 12-14ఏండ్ల పిల్లందరికీ కొవిడ్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించినట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి కృపాబాయి తెలిపారు. జిల్లాలో సుమారు 35,196 మంది 12-14 ఏండ్ల పిల్లలున్నారని, వారి కోసం బుధవారం నుంచి జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. జిల్లాలో తొలిరోజు మొదటి డోసు 254 మంది పిల్లలు తీసుకున్నారని, వారంతా సెకండ్ డోసును 28వ రోజుల తర్వాత తీసుకోవాలని సూచించారు. అలాగే కొవాగ్జిన్/కొవిషీల్డ్ సెకండ్ డోసు తీసుకొని 39 వారాలు పూర్తయిన 60 ఏండ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోసు ఇస్తున్నామని తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ధర్మారం, మార్చి 16: నంది మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12-14 ఏండ్ల మధ్య పిల్లలకు వ్యాక్సినేషన్‌ను ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ ప్రారంభించారు. అలాగే నేషనల్ ఇమ్యునైజేషన్ డేను పురస్కరించుకుని ఉత్తమ సేవలందిస్తున్న ఏఎన్ఎం శారద, ఆశ కార్యకర్తలు స్వప్న, లతను ఎంపీపీ సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ సంపత్‌రెడ్డి, హిమబిందు, సర్పంచ్ సామంతుల జానకి, ఎంపీటీసీలు మిట్ట తిరుపతి, కట్ట సరోజ, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ సలామొద్దీన్, ఉప సర్పంచ్ కట్ట రమేశ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఎలిగేడు, మార్చి 16: స్థానిక పీహెచ్సీలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించి 15 మంది పిల్లలకు టీకా వేశారు. వైద్యాధికారి నిస్సీక్రిస్టినా, ఎంపీపీ తానిపర్తి స్రవంతి, ఎంపీడీవో శ్రీనివాసమూర్తి, సర్పంచ్ బూర్ల సింధూజ, ఉపసర్పంచ్ కోరుకంటి వెంకటేశ్వర్రావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కాల్వశ్రీరాంపూర్, మార్చి 16: మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్, ఎంపీపీ నూనేటి సంపత్, జడ్పీటీసీ వంగ ళ తిరుపతిరెడ్డి, ఎంపీడీవో రామ్మోహనాచారి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ దేవయ్య, సిబ్బంది ఉన్నారు.