వేములవాడ, నవంబర్ 20 : ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల పేరిట బుధవారం వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి సభ నిర్వహించారు. గుడిచెరువులో ఏర్పాటు చేసిన ఈ సభకు మహిళలను పెద్దసంఖ్యలో తరలించారు. సీఎం రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి, మధ్యాహ్నం 1.25 గంటలకు సభా స్థలానికి చేరుకున్నారు. దాదాపు గంట 20 నిమిషాలపాటు మంత్రులు ఉపోద్ఘాతాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మరో 37 నిమిషాలు ప్రసంగించారు. అయితే ఎన్నికల ముందు ఆకర్శించే మాటలు మాట్లాడిన ఆయన, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా ఇతరులను విమర్శించడంపైనే ప్రసంగం చేశారు. అప్పటికే సమావేశానికి బలవంతంగా వచ్చిన మహిళలు, ప్రజలు మంత్రుల ప్రసంగాల నుంచే ఒకొకరిగా బయటకు వెనుదిరిగారు. అకడ విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, పోలీసులు సైతం వారిని బెదిరించి కూర్చోబెట్టేందుకు ప్రయత్నించారు. అయినా ఆగకపోగా, సీఎం ప్రసంగం పూర్తికాక ముందే సగం ఖాళీ అయింది. ముందట మంది కనిపించినా చివరలో మాత్రం కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి.