AADI SRINIVAS | కథలాపూర్, ఏప్రిల్ 9 : రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు. మండలంలోని పోసానిపేట, భూషణ్ రావు పేట గ్రామాల్లో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతతో కలిసి ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని సరైన మద్దతు ధరకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామన్నారు.
అనంతరం సిరికొండ గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షక పాదయాత్రలో ప్రభుత్వ విప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడాడుతూ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇస్తూ కొనుగోలు చేస్తున్నామని వివరించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్, ఎరువులు,మేలైన వంగడాలను ప్రభుత్వం తరుపున అందిస్తున్నామని తెలిపారు. రైతులకు ఏక కాలంలో రైతు ప్రయోజనాలు కోసం 21 వేల కోట్ల మేర రుణమాఫీ చేయడం జరిగిందని వెల్లడించారు.
సన్న వడ్లు పండించే రైతులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్వింటాల్ కు అదనంగా రూ. 500 ఇస్తున్నదని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు చూడాలని, సరిపడా టార్పలిన్ కవర్లు, గన్ని సంచులు,ఇతర సామాగ్రి అందుబాటులో ఉంచాలని విప్ ఆదేశించారు. రైతులు పండించిన పంట చివరి గింజా వరకు కొంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ జివాకర్ రెడ్డి, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ నారాయణ రెడ్డి, రైతులు, నాయకులు కరపు గంగాధర్, కల్లెడ శంకర్, గుండారపు గంగాధర్, ఎండి ఆఫీస్, తీట్ల శంకర్, కొండ ఆంజనేయులు, సీఈఓ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.