Sunke Ravishankar | గంగాధర, జూన్ 28 : కాంగ్రెస్ పార్టీ అవగాహన లేకుండా తీసుకువచ్చిన యూరియా యాప్ తో తెలంగాణ రాష్ట్రంలోని అన్నదాతలు అరిగోస పడుతున్నారని, యాప్ పేరుతో యూరియా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను ఇబ్బందికి గురిచేస్తోందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గంగాధర మండలం మధురానగర్ చౌరస్తా కరీంనగర్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి ఆదివారం ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రవిశంకర్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి తో పాటు నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి గంగాధర పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ తీసుకువచ్చిన యాప్ లో, ఇటు షాపుల్లో యూరియా లేదని ఎద్దేవా చేశారు. సీజన్ కు ముందే చాలినంత యూరియా స్టాక్ పెట్టి రైతులకు అందించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం మంది రైతులు చిన్న ఫోన్లను వాడతారని, చిన్న ఫోన్లలో ఈ యాప్ ను ఎలా ఇన్స్టాల్ చేయాలని ప్రశ్నించారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను బ్రతిమిలాడి యాప్ లో పేరును నమోదు చేసుకున్న నో స్టాక్ అని చూపిస్తోందన్నారు. బోయినపల్లి మండలంలో పేరు నమోదు చేసుకున్న రైతులు ఇల్లంతకుంట మండలానికి వెళ్లి యూరియా తీసుకోవలసిన పరిస్థితి దాపురించిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రైతులను మోసం చేస్తున్నాయని పేర్కొన్నారు.
యూరియా దళారుల చేతిలోకి వెళ్లిందని, బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరకు యూరియా బస్తాలు అమ్ముతున్నారని ఆరోపించారు. 2014 కు ముందు ఎరువుల కోసం చెప్పులు లైన్ లో పెట్టిన పరిస్థితి మళ్లీ వచ్చిందని గుర్తు చేశారు. కెసిఆర్ పాలనలో సీజన్ కు ముందే చాలినంత యూరియాను అందుబాటులో ఉంచారని, ఫోన్ చేస్తే ఆటోలో ఇంటికి తీసుకువచ్చి యూరియా ఇచ్చిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా నాడు కెసిఆర్ ప్రభుత్వం పని చేస్తే, రైతులను అరిగోస పెట్టడమే లక్ష్యంగా నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ యాప్ ను రద్దు చేసి, గతంలో మాదిరిగా రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ యాప్ ను రద్దు చేసే వరకు బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు.