సైదాపూర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని వెన్కేపల్లి- సైదాపూర్ సహకార సంఘం వద్ద యూరియా (Urea) కోసం రైతులు క్యూ కట్టారు. చెప్పులను లైనులో ఉంచి తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. శక్రవారం రాత్రి సహకారం సంఘానికి 250 బస్తాల యూరియా వచ్చింది. దీంతో శనివారం ఉదయం పలు గ్రామాల రైతులు సొసైటీ వద్దకు చేరుకుని తమ చెప్పులను క్యూ లైన్లో పెట్టారు. పెద్ద సంఖ్యలో రైతులు తరలిరావడంతో పోలీస్ పహార నడుమ యూరియా అందించారు. ఒక్కొక్కరికి 2 బస్తాల చొప్పున సహకార సంఘం సిబ్బంది పంపిణీ చేశారు.
అయితే కేవలం రెండు యూరియా ఇవ్వడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమందికి మాత్రమే యూరియా దొరకగా మిగతా రైతులు ఉత్తచేతులతో వెనుదిరిగారు. యూరియా కొరత వల్ల ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం వెంటనే డిమాండుకు సరిపడా సరఫరా చేయాలని కోరుతున్నారు. గతంలో యూరియా కొరత లేకండా ఉండేదని ఇప్పుడు కష్టాలు పడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.
రైతులకు సరిపడా ఎరువులను అందించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య డిమాండ్ చేశారు. రైతులకు ఎరువులను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు కాళేశ్వరం ద్వారా సాగునీరు అందిచడంతోపాటు అన్ని సౌకర్యాలు కల్పించారన్నారు. ఒక వైపు ఎరువుల కొరత లేదని అధికారులు చెబుతుంటే రైతులకు మాత్రం సరిపడా అందడం లేదని చెప్పారు. అధికారులు ఎరువుల పంపిణీ కేంద్రాలకు వస్తే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయాని చెప్పారు. రైతులకు ఎరువులు సకాలంలో అందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చెప్పాడుతామన్నారు. రైతులకు అండగా బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమం లో నాయకులు మునిపాలా శ్రీనివాస్, చాడ ఆదిరెడ్డి, హరీష్ రావు, నరేష్ తదితరులు రైతులు పాల్గొన్నారు.