ఉమ్మడి జిల్లాలో యూరియా కష్టాలు తీవ్రమవుతున్నాయి. ఎలాంటి కొరతా లేదని అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం రైతులు ఇబ్బందులు పడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. సొసైటీలకు వచ్చిన కొద్ది సమయంలోనే నిల్వలు ఖాళీ అవుతున్నాయి. బారులు తీరుతున్నా చివరి రైతులకు అందడం లేదు. కాస్త ఆలస్యంగా వచ్చినా దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయా.. లేవా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో మార్క్‌ఫెడ్ ఎరువులు సరఫరా చేస్తుండగా, చిన్న సొసైటీలు పూర్తి స్థాయిలో ఎరువులు తెప్పించే పరిస్థితి లేదు. దీంతో ఆయా సొసైటీల పరిధిలో తిప్పలు తప్పడం లేదు. అయినా పట్టించుకునే వారు లేక రైతులు ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ కష్టాలు మొదలయ్యాయని మండిపడుతున్నారు. సకాలంలో పంటకు వేయకుంటే దిగుబడి మునిగే ప్రమాదముంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కరీంనగర్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. నాట్లు వేసి రెండు నెలలైనా దొరక్క నిరీక్షిస్తున్నారు. సరిపడా నిల్వలు లేక రోజుల కొద్దీ గోదాముల చుట్టూ తిరుగుతూ పరేషాన్ అవుతున్నారు. ఎక్కడ చూసినా రైతులు ఇబ్బందులు పడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. కరీంనగర్ జిల్లాలో చూస్తే.. సుమారు 42,416 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి ఇండెంట్ ఇచ్చారు. ఈ ఎరువులను 50 శాతం ప్రైవేట్ డీలర్లకు, మరో 50 శాతం మార్క్‌ఫెడ్‌కు సరఫరా చేస్తున్నారు.
మార్క్‌ఫెడ్‌కు వచ్చే ఎరువులను జిల్లాలోని 30 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు, 42 డీసీఎమ్మెస్ సెంటర్లకు, మరో 18 ఆగ్రోసెంటర్లకు సరఫరా చేసి, అక్కడి నుంచి రైతులకు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 39,386 మెట్రిక్ టన్నుల యూరియా రాగా, అందులో 50 శాతం కింద 19,693 మెట్రిక్ టన్నులను సొసైటీలు, డీసీఎమ్మెస్, ఆగ్రో సెంటర్లకు అందించారు. రైతులకు పంపిణీ కూడా చేస్తున్నారు. అధికారులు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం ఇంకా 3,030 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉన్నది.
ప్రస్తుతం జిల్లాలో మార్క్‌ఫెడ్, ప్రైవేట్ డీలర్ల వద్ద కలిపి కేవలం 1,200 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఉన్నట్లు తెలుస్తున్నది. దీంతోపాటు జిల్లాకు రావాల్సిన యూరియాను కలుపుకుంటే 4,230 మెట్రిక్ టన్నులే అవుతుంది. ఇంకా సీజన్ నడి మధ్యలోనే ఉన్నది. కనీసం మరో 5 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండే అవకాశమున్నది. ఈ మేరకు అధికారులు కూడా అదనంగా ఇండెంట్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. జిల్లాకు ఇంకా రావాల్సిన యూరియాపోను మరో 2,500 మెట్రిక్ టన్నుల కోసం వారం పది రోజుల కిందనే ఇండెంట్ ఇచ్చినట్టు తెలుస్తుండగా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. కనీసం జిల్లాకు రావాల్సిన యూరియానైనా ఇస్తారా.. లేదా? అనే సందేహం రైతుల్లో వ్యక్తమవుతున్నది.
యూరియా కొరతకు తోడు మార్క్‌ఫెడ్ నిబంధనలతో కొన్ని పీఏసీఎస్‌లకు తిప్పలు తప్పడం లేదు. పదేళ్ల నుంచి సహకార సంఘాలకు ఎరువుల సరఫరాకు బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చేది. దీంతో అవసరమైన ఎరువులను క్రెడిట్‌పై మార్క్‌ఫెడ్ సరఫరా చేసేది. ఇప్పుడా పరిస్థితి లేదు. క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో ఎరువులు ఇస్తుండగా, ఆర్థిక వనరులు లేని సంఘాలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఏ సహకార సంఘం, డీసీఎమ్మెస్, ఆగ్రో సెంటర్ల పరిధిలో ఎంత యూరియా అవసరం ఉంటుందనేది వ్యవసాయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పంటల సాగు విస్తీర్ణాన్ని బట్టి ఇప్పటి వరకు సరఫరా, ఇంకా ఎంత అవసరం? అనేది దృష్టిలో పెట్టుకొని మార్క్‌ఫెడ్‌కు సూచిస్తున్నారు. ఆ మేరకు ఆయా సంఘాలకు యూరియా సరఫరా అవుతున్నది. కానీ, క్యాష్ అండ్ క్యారీ విధానంతో కొన్ని సంఘాలు ఆర్థిక వనరులు సరిగ్గా లేక సకాలంలో డీడీ లు తీయడం లేదని తెలుస్తున్నది. సరిపడా ఎరువులు కూడా తెచ్చి రైతులకు ఇవ్వలేని దుస్థితి ఉన్నది. ఇదే విషయమై కొందరు సీఈవోలతో మాట్లాడితే, తమ సంఘాలకు పరిపుష్టిగా ఆర్థిక వనరులు ఉన్నాయని, యూరియా కోసం అడ్వాన్స్‌గా డీడీలు తీసి మార్క్‌ఫెడ్‌కు పంపిస్తున్నామని, కొరత కారణంగానే తమకు సకాలంలో యూరియా సరఫరా చేయడం లేదని స్పష్టం చేస్తున్నారు.
పరిస్థితులు ఏవైనా వారం పది రోజుల నుంచి యూరియా కొరత ఏర్పడినట్టు స్ప ష్టంగా తెలుస్తున్నది. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే తమ పరిస్థితి ఏంటనే ఆందోళన రైతు ల్లో వ్యక్తమవుతున్నది. జిల్లాలో ఇప్పటికే 38వేల మెట్రిక్ టన్నులకుపైగా యూ రియా వినియోగించారని, మరో 5వేల మెట్రిక్ టన్నులైనా అవసరం ఉంటుందని అంచనా ఉంది. కానీ, సహకార సంఘాలకు ఎరువు లు వస్తున్నట్టు తెలిసిన వెంటనే రైతులు బారులు తీరుతున్నారు. వచ్చిన ఎరువులు ఎవరికో కొందరికి మాత్రమే అందుతుండ గా, ఆగ్రహిస్తున్నారు. కాస్త వెనకైన రైతులకు ఒక్క బస్తా కూడా దొరకని పరిస్థితి ఉండగా, కొందరు అవసరానికి మించి కొ నుగోలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఏ రైతు కు ఎంత అవసరం ఉంటే అన్నే యూరియా బస్తాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే కరీంనగర్ రూరల్, తి మ్మాపూర్, మానకొండూర్, సైదాపూర్ తదితర మండలాల్లో నిరసన వ్యక్తం చేశారు. యూరియా కోసం ఇవే పరిస్థితులు ఇలాగే కొనసాగితే, కీలక దశలో ఉన్న వరికి సకాలంలో అందించకపోతే దిగుబడిపై ప్రభావం చూపుతుందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి అధికారులు ఇచ్చిన ఇండెంట్ మేరకు యూరియా సరఫరా చేయాలని కోరుతున్నారు.
తిమ్మాపూర్ రూరల్/ చిగురుమామిడి, ఫిబ్రవరి 21 : యూరియా కోసం రైతులు పొద్దంతా పడిగాపులు కాయాల్సి వస్తోంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్, చిగురుమామిడి మండలాల్లో యూరియా కోసం ప్రాథమిక సహకార సంఘాల వద్ద బారులు తీరి నిల్చుంటున్నారు. శుక్రవారం తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామంలోని పీఏసీఎస్‌కు 350 బస్తాల యూరియా లోడ్ రాగా, రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఒక్కొక్కరికి రెండు చొప్పున మాత్రమే ఇచ్చారు. దీంతో రెండు బస్తాలు ఎలా సరిపోతాయని అధికారులను నిలదీశారు. యూరియా వచ్చిన గంటకే బస్తాలు దొరకక పోవడంతో చాలా మంది రైతులు నిరాశతో వెనుదిరిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని, నాట్లు వేసి నెలన్నర గడుస్తున్నా యూరియా వేయలేదని రైతులు వాపోయారు. సకాలంలో ఎరువులు లేకపోతే పంటలు ఎలా పండించాలని మండిపడ్డారు. చిగిరుమామిడి మండలకేంద్రంలోనూ యూరియా కోసం రైతులు పనులు వదులుకొని పొద్దంతా బారులు తీరి నిల్చున్నారు.