గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడే లీకేజీలు ఎందుకు జరుగుతున్నాయో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నిజానికి రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. దేశానికే ఆదర్శంగా నిలిచింది. మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా బద్నాం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుట్రలకు తెరలేపిండు. పేపర్ లీకేజీలకు సూత్రధారి, పాత్రధారిగా వ్యవహరిస్తూ.. కరీంనగర్ పరువు తీస్తున్నడు. తనస్వార్థ రాజకీయాల కోసం లక్షలాది మంది విద్యార్థులు, యువతీ యువకుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నడు. ఒక ఎంపీగా బాధ్యత ఉన్న వ్యక్తి అయితే.. పేపర్ లీకయిన వెంటనే పోలీసుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? వాటిని బీజేపీ సోషల్ మీడియా గ్రూపుల్లో ఎందుకు వైరల్ చేసిండు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. ఈ వ్యవహారంలో ఎంతటి వారినైనా సరే ఉపేక్షించే ప్రశ్నేలేదు. యువత ఆగం కావద్దు. తల్లిదండ్రులు ఆందోళన చెందద్దు.
కరీంనగర్, ఏప్రిల్ 5 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : తనస్వార్థ రాజకీయాలకోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పరువు తీస్తున్నారని, లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, పేపర్ లీకేజీలకు సూత్రధారి, పాత్రధారిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన అనుసరిస్తున్న మార్గాలు నీచ సంస్కృతిని బయట పెడుతున్నాయని ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధిలో పోటీపడీ కరీంనగర్‌కు మంచి పేరు తేవాలే తప్ప.. పరువు తీసేపనులు చేయవద్దని సూచించారు. కరీంనగర్ మీ సేవా కార్యాలయం లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన సంజయ్ తీరుపై నిప్పులుగక్కారు. ఇదే సమయంలో పలు ప్రశ్నలు సంధి ంచి, సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ప్రధాన సూత్రధారి రాజశేఖర్‌తోపాటు పదోతరగతి పేపర్‌లీకేజీలో ప్రధాన వ్యక్తిగా భావిస్తున్న ప్రశాంత్ కూడా సంజయ్‌కు అత్యంత సన్నిహితుడేనని, ఈ వ్యవహారం నిశితంగా పరిశీలిస్తే అంతా సంజయ్ కనుసన్నుల్లో నడువడమేకాదు, అతనే ప్రధాన సూత్రధారుడిగా కనిపిస్తున్నారని విమర్శించారు.
టీఎస్పీఎస్సీలో ఓవైపు వాస్తవాలు బయటకు వస్తుంటే.. ఇప్పుడు పదో తరగతి పరీక్షల లీకేజీలకు బండి తెరలేపారని విమర్శించారు. అందులో భాగంగానే పదో తరగతి పేపర్ లీకైందంటూ స్వయంగా సంజయ్ బీజేపీ గ్రూపులకు పంపించి వైరల్ చేశారని ఆరోపించారు. ఎంపీగా ఒక రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్నారని, ప్రశ్నాపత్రం లీకైనట్లు ఆయకు సమాచారం వస్తే ఆ విషయాన్ని వెంటనే పోలీసులకు లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయనకు లేదా..? అని ప్రశ్నించారు. అలా కాకుండా బీజేపీ గ్రూపుల్లో వైరల్ చేసి లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనకు సంజయ్ కారణం అయ్యారని మండిపడ్డారు.
టీఎస్పీఎస్సీ లీకేజీ విషయంలో ప్రధాన వ్యక్తి రాజశేఖర్‌రెడ్డి, అలాగే పదో తరగతి పరీక్షల లీకేజీలో ప్రధాన వ్యక్తి ప్రశాంత్ ఇద్దరు కూడా బండి సంజయ్‌కు అత్యంత సన్నిహితులని మంత్రి చెప్పారు. ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తే లీకేజీలు, సోషల్ మీడియాలో వైరల్ చేయడాలు అన్నీ కూడా సంజయ్ కుట్రలో భాగంగా జరుగుతున్నవే అన్న విషయం అర్థమవుతుందన్నారు. ప్రశాంత్ అనే వ్యక్తి బండికి అత్యంత సన్నిహితుడా..? కాదా..? చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రశాంత్‌కు టీఆర్ఎస్ నాయకులతో సంబంధాలుంటే వారెవ్వరికి పేపర్ పంపకుండా.. సంజయ్‌కు మాత్రమే ఎందుకు పంపారో చెప్పాలన్నారు. అలాగే బాధ్యత గల ఎంపీగా పేపర్ లీకయి ఉంటే సంబంధిత అధికారులు లేదా పోలీసుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? వాటిని బీజేపీ సోషల్ మీడియా గ్రూపుల్లో ఎందుకు వైరల్ చేశారు? దీని వెనుక రాజకీయ లబ్ధి ఏమిటి? అన్న విషయాలను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఇదంతా నూటికి నూరు శాతం సంజయ్ ప్రీ ప్లాన్‌లో భాగంగా జరుగుతున్నవే తప్ప మరోటికావన్నారు. పరీక్ష రాసే వారిలో బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన నాయకుల పిల్లలు కూడా ఉంటారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. బీహార్ సంస్కృతిని ఇక్కడి తెచ్చే కుట్రలు మానుకోవాలని, ఇక ముందైనా పరుపుపోయే పనులు చేయవద్దని హితవు పలికారు. సంజయ్ అరెస్ట్ సమయంలో ఆయన ఇంటి వద్ద అంత మంది నాయకులు ఎందుకున్నారని, అంటే సంజయ్‌కు ఆయన చేసి తప్పు ముందే తెలుసని, ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేస్తారనే కారణంగానే ఆయన ఇంటివద్ద అంత మంది ఉన్నారనే విషయాన్ని గుర్తించాలన్నారు. పేపర్ లీకేజీల విషయంలో ఎంతటి వారినైనా సరే ఉపేక్షించే ప్రశ్నేలేదని, తల్లిదండ్రులు, ఉద్యోగార్థులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మేయర్ సునీల్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పరీక్షలను సమర్థవంతగా నిర్వహించింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడే లీకేజీలు ఎందుకు జరుగుతున్నాయో నిశిత పరిశీలన చేయాలి. నిజానికి రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. దేశంలోని ప్రతి రాష్ట్రం తెలంగాణవైపు చూస్తున్నది. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఉద్యోగావకాశాలు పెరిగాయి. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అనుకున్న స్థాయిలో పురోగతి ఉన్నది. అతితక్కువ కాలంలోనే తెలంగాణకు అత్యంత మంచి పేరు వచ్చింది. మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా బద్నాం చేసి పబ్బం గడుపుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఉద్యోగాలు సజావుగా భర్తీ అయితే యువత మొత్తం తమ చేతుల్లోంచి చేజారి పోతుందని, జెండా మోసే వారు కూడా ఉండరన్న ఉద్దేశంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుట్రలకు తెరలేపారు. అందులో భాగమే పేపర్ లీకేజీలు.
– మంత్రి గంగుల కమలాకర్