రాజన్న సిరిసిల్ల, మే 23 (నమస్తే తెలంగాణ) : ప్రకృతి పగబట్టింది. అకాల వర్షాలతో అన్నదాత ఆగమవుతున్నడు. ఆరుగాలం శ్రమ వర్షార్పణమవుతున్నది. నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో కాంటాకు నోచుకోలేని ధాన్యం మొలకెత్తింది. కర్షకుల కళ్లలో ధైన్యం కనిపిస్తున్నది. వానకా లం తలపించేలా కురుస్తున్న భారీ వర్షాలతో తీవ్ర నష్టం వా టిల్లుతున్నది. నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు అతలా కుతలం చేస్తున్నాయి. అసలే హమాలీలు లేక, లారీల కొరత కారణంగా కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం కాంటాకు నోచుకోలేక పోతున్నాయి.
కాంటా పెట్టాలంటూ రైతులు జిల్లాలో అనేక మండలాల్లో ఇప్పటికే పలు మార్లు రైతు లు ఆందోళనలు చేశారు. రెడ్డెక్కి నిరసనలు, రాస్తారోకోలు చేపట్టారు. అకాల వర్షాలు పడితే తమ బతుకులు ఆగమై పోతాయని గోడు పెట్టుకున్నా సర్కారు చెవికెక్కలేదు. రైతు లు ఊహించినట్లుగానే భారీ వర్షాలు పడి సెంటర్లలో ఆరబోసిన ధాన్యం నీటిపాలైంది. మరిన్ని భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు కర్షకులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. వాన రాకుడా ప్రాణం పోకడ తెలియదన్నట్టు రైతులు బిక్కుబిక్కు మంటూ ఇల్లు వదిలి రాత్రింబవళ్లు కేంద్రాలలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు ఐకేపీ సెంటర్లు చాలా వరకు పంటచేల వద్ద మైదానం లాంటి ప్రదేశాలలో ఏర్పాటు చేశారు. వర్షానికి బురద మయంగా మారి నడిచేందుకు వీలు లేని పరిస్థితి ఏర్పడింది.
జిల్లాలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో నెల రోజుల కింద తెచ్చిన వడ్లను ఇప్పటి వరకు కాంటా పెట్టలేదు. దీంతో వర్షానికి తడిసిపోయిన ధాన్యం ఆరాలంటే వాన గెరివిస్తే కాని, తేమ శాతం ఉండదు. ఒకవైపు కమ్ముకొస్తున్న మబ్బులతో ఎండ రాక వడ్లు ఆరక కాం టా పెట్టడంలో మరింత జాప్యం జరుగుతోంది. జిల్లాలోని వీర్నపల్లి, కోనరావుపేట, ఇల్లంతకుంట, చందుర్తి బోయినిపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసి పోతుందంటూ రైతులు నిరసన తెలిపారు. ఇల్లంతకుంట మండలంలోని దాచారం గ్రామంలోని ఐకేపీ సెంటర్లో నెల కింద రైతులు తెచ్చిన ధాన్యం ఇంకా కాంటా వరకు రాలేదు.
అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యం లో కుప్పలపై కవర్లు కప్పారు. శుక్రవారం ఉదయం చూసే సరికి వడ్లన్నీ మొలకెత్తడం చూసిన రైతులు నెత్తినోరు బాధుకున్నారు. తాము కేంద్రానికి తెచ్చి నెలరోజులవుతున్నా కాం టా పెట్టక పోవడంతో మొలకెత్తాయంటూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో తమకు నష్టం జరిగిందంటూ ఆరోపించారు. మొలకెత్తిన వడ్లను కొనాలం టూ డిమాండ్ చేశారు. దాచారం సెంటర్లోనే ఇంకా దాదా పు 15 లారీల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో లారీల ధాన్యం కొనాల్సిన పరిస్థితి ఉంది. అధికారులు ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలని రైతులు వేడుకుంటున్నారు.