Urea | గన్నేరువరం, డిసెంబర్ 28 : రబీ సీజన్ పంటల కోసం రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ఆదివారం 340 యూరియా బస్తాలు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న రైతులు బారులు తీరారు. ఎకరానికి ఒక బస్తా చొప్పున రైతులకు యూరియాను అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వానాకాలంలో యూరియా కోసం నానా తంటాలు పడుతున్నామని వాపోయారు.
చాలా ఇబ్బందులు పడుతున్నా అయినా యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత సీజన్లో యూరియా లేకపోవడంతో పంటలు సరిగా పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యాసంగిలోనైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు యూరియా కొరత లేకుండా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.