సిరిసిల్ల రూరల్, జూలై 7: అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పుకునే కేంద్రం, జిల్లాలోని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నది. పనులు ప్రారంభమై ఏండ్లు గడుస్తున్నా.. అధికారుల నిర్లక్ష్యం, పట్టింపులేమితో ఏ ఒక్కటీ పూర్తికాని పరిస్థితి నెలకొన్నది. ఇందుకు తంగళ్లపల్లి మండలమే నిదర్శనంగా నిలుస్తున్నది. వివరాల్లోకి వెళితే.. ఎన్డీయే హయాంలో ప్రారంభించిన తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్ పార్క్ సమస్యల వలయంలో ఉన్నది. కోరుట్ల-వేములవాడ-సిరిసిల్ల-సిద్దిపేట రహదారి మంజూరైన, ఇంకా పనులు ప్రారంభంకాలేదు.
ఇక పోతే నాడు ఎంపీగా ఉన్న కేసీఆర్ ప్రత్యేక చొరవతో మంజూరైన కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ పనులు సిద్దిపేట వరకు పూర్తయి ప్రారంభమైన విషయం తెలిసిందే. కానీ సిద్దిపేట-సిరిసిల్ల రైల్వే లైన్ నత్తనడకన కొనసాగుతున్నది. ఇకపోతే అప్పటి ఎంపీ వినోద్‌కుమార్ ప్రత్యేక చొరవతో కేంద్రియ విద్యాలయం మంజూరు కాగా, గతేడాది మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో పద్మనగర్ శివారులోని పనులు ప్రారంభించారు. తుది దశకు చేరినప్పటికీ ఇప్పటికీ ప్రారంభంకాలేదు. కరీంనగర్ ఎంపీగా రెండోసారి ఎన్నికై, కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ దృష్టి సారించాలని, త్వరగా అందుబాటులోకి తేవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని టెక్స్టైల్ పా ర్క్ను 2002లో నాటి ఎన్డీయే సర్కారు ఏర్పాటు చేసింది. తర్వాత వచ్చిన యూపీఏ సర్కారు గాలికొదిలేయగా, మళ్లీ 2014లో పవర్లోకి వచ్చిన బీజేపీ సర్కారు కూడా పట్టించుకోలేదు. పలుమార్లు మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ టెక్స్‌టైల్‌పార్క్ అభివృద్ధికి సహకరించాలని విన్నవించినా స్పందించలేదు. మెగా టెక్స్టైల్ జోన్, కామన్ ఫెసిలిటి సెంటర్, శిక్షణ కేంద్రం, పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందివ్వాలని కోరినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే నెట్టుకొస్తున్నారు. టెక్స్టైల్ రంగం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ప్రత్యేక శాఖ ఉన్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
ఇక కరీంనగర్ ఎంపీగా రెండుసార్లు గెలిచిన బండి సంజయ్‌కుమార్ ఏనాడూ టెక్స్‌టైల్‌పార్క్‌ను సందర్శించలేదు. బీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఆర్డర్లు అందించి, కార్మికులకు ఉపాధి కల్పించారు. కానీ కొత్త సర్కారు పట్టింపులేమితో ఆరు నెలలుగా కార్మికులు ఉపాధి లేక ఆగమవుతున్నారు. అయితే సోమవారం తంగళ్లపల్లి మండల కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పర్యటించనుండగా, ఇక్కడి ప్రజలు ఆయనపై ఆశలు పెట్టుకున్నారు. సమస్యలపై బండి సంజయ్ దృష్టి సారించి, త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.