విద్యానగర్, జూన్ 18: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం జిల్లాకు వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో వెళ్లారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవి వరించగా, ఈ నెల 13న అక్కడే బాధ్యతలు స్వీకరించారు. అదే రోజు అభిమానులు, నాయకులు ఢిల్లీ వెళ్లి అభినందనలు తెలిపారు.
సెంట్రల్ మినిస్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా కరీంనగర్ వస్తున్న ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. ఉదయం 9 గం టలకు శనిగరం స్టేజ్ వద్ద ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. సంజయ్ అక్కడి నుంచి నాయకులతో బయలు దేరి, నగరంలోని మహాశక్తి ఆలయానికి చేరుకుంటారు. తర్వాత కొండగట్టు అంజన్న క్షేత్రం, నల్లగొండ లక్ష్మీ నరసింహ స్వామి, వేములవాడ రాజన్న, సిరిసిల్ల మార్కండేయ స్వామిని దర్శించుకొని పూజలు చేస్తారని, ఈ నెల 23 వరకు వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తారని పార్టీ నాయకులు తెలిపారు.