అధికార పార్టీ పనితీరుకు అద్దంపట్టే మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కంగుతున్నది. రెండేళ్ల తమ పాలనకు రెఫరెండం అన్నట్టు చెప్పుకొచ్చిన ఆ పార్టీకి, అడుగడుగునా ప్రతి బంధకాలే ఏర్పడ్డాయి. ఉమ్మడి జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో తామే జెండా ఎగురవేస్తామంటూ పదే పదే చెప్పినా.. శుక్రవారం వెలువడిన ఫలితాలు షాక్‌కు గురిచేశాయి. నిజానికి 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆనాటి అధికార పార్టీ బీఆర్ఎస్.. ఉమ్మడి జిల్లాలోని ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వకుండా రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలపై జెండా ఎగురవేసింది. కానీ, ప్రస్తుతం మున్సిపల్ ఫలితాలు భిన్నంగా రావడంతో అధికార పార్టీ అంతర్మథనంలో పడింది. కాగా, కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ మొదటిసారిగా అనూహ్య ఫలితాలను సాధించి, అందరినీ నివ్వెర పరిచింది. జమ్మికుంట పురపాలక సంఘంలో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా నిలువగా.. మెట్పల్లిలో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించింది. అయితే, కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఎంఐఎం మాత్రం దెబ్బతిన్నది.
కరీంనగర్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో శుక్రవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. హస్తం పార్టీని అంతర్మథనంలో పడేశాయి. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఈ ఎన్నికల్లో ప్రజల మనసులను పూర్తిగా గెలుచుకోలేదన్న విషయం మరోసారి బయటపడింది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు బయటపడిన ఆ పార్టీకి, ఇప్పుడు అదే అనుభవం ఎదురైందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిజానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అంటే.. 2020 జనవరిలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఆనాడు అధికార పార్టీ బీఆర్ఎస్ పనితీరుకు ఉమ్మడి జిల్లాలోని పట్టణ ప్రజలు జైకొట్టారు. రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ను గెలిపించి అండగా నిలిచారు. కానీ, నేడు కాంగ్రెస్ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉన్నది. రెండేళ్ల పాలన తర్వాత వచ్చిన ఈ ఎన్నికల్లో రెండు కార్పొరేషన్లు, 13 పురపాలక సంఘాల్లో జెండా ఎగురవేయాలని అధికార పార్టీ ఉవ్విళ్లూరింది. అందులో భాగంగానే అన్ని పార్టీలకన్నా ముందుగానే కార్యాచరణ రూపొందించుకొని, ముందుగానే ప్రచారం ప్రారంభించింది. అంతేకాదు, ఈ ఎన్నికలు పట్టణ ప్రాంతాల్లో తమ రెండేళ్ల పనితీరుకు రెఫరెండం అన్న స్థాయిలో అధికార పార్టీ మంత్రులు, నేతలు చెప్పుకొచ్చారు. అన్నీంటిపైనా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని చెప్పారు. కానీ, ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. రెండు కార్పొరేషన్లలో రామగుండానికి మాత్రమే హస్తం పార్టీ పరిమితమైంది. అలాగే రాయికల్, జమ్మికుంట, మెట్పల్లి మున్సిపాలిటీలను సాధించుకోలేకపోయింది.
ముందు నుంచీ కరీంనగర్ కార్పొరేషన్‌పై గురిపెట్టిన కాంగ్రెస్‌కు శుక్రవారం వెలువడిన ఫలితాలు కంగుతినిపించాయి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొప్పదండి నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి.. కరీంనగర్ కార్పొరేషన్ గురించి ప్రస్తావించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో 1450 కోట్లు విడుదల చేసినట్టు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. అంతేకాదు, అభివృద్ధి సజావుగా జరగాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని సూచించారు. కానీ, నగర ప్రజలు మాత్రం అందుకు భిన్నమైన తీర్పును ఇచ్చారు. అతిపెద్ద కార్పొరేషన్లో హస్తం పార్టీని కేవలం 14 స్థానాలకే పరిమితం చేశారు. నిజానికి కరీంనగర్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్.. అన్నీ పార్టీల కన్నా ముందుగా ప్రచారం ప్రారంభించింది. అయినా విజయం సాధించడంలో మాత్రం వెనుకంజలో నిలిచింది. కాగా, మొదటిసారిగా బీజేపీ అనూహ్య విజయం సాధించింది. 30 స్థానాలతో అధిక సీట్లు సాధించిన పార్టీగా నిలిచింది. అయితే, మేయర్ పదవి దక్కాలంటే 34 సీట్లు అవసరం ఉన్నది. ఈ పరిస్థితుల్లో వేరే అభ్యర్థుల సహకారం తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
కరీంనగర కార్పొరేషన్లో ఎంఐం వెనుకపడింది. 2020 ఎన్నికల్లో ఆరు స్థానాల్లో విజయం సాధించిన ఆ పార్టీ, ఈ సారి 15 స్థానా ల్లో పోటీ చేసింది. ఎనిమిది స్థానాలకు తగ్గకుండా సీట్ల వస్తాయని ఆశిస్తే.. నిరాశే ఎదురైంది. కేవలం మూడు సీట్లకే పరిమితమైంది. ఎంఐఎంలో నెలకొన్ని విభేదాలు, పార్టీ నాయకుల మధ్య సమన్వయ లోపం.. తదితర కారణాలు ఆ పార్టీకి మైనస్‌గా మారినట్టు తెలుస్తున్నది.
జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు సాధించి, మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 30 వార్డులకు 12 స్థానాల్లో విజయం సాధించింది. పది వార్డుల్లో కాంగ్రెస్, నాలుగు వార్డులో బీజేపీ, నాలుగు వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే, అధికారపీఠం దక్కించుకోవడానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు విఫల ప్రయత్నం చేశారు. అయితే బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుపడడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. కిడ్నాప్‌నకు గుర య్యే అభ్యర్థులతో మాట్లాడారు. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన తాము, తమ పార్టీ గూటికే వెళ్తామని భీష్మించడంతో అభ్యర్థులకు రక్షణగా నిలిచారు. చివరకు బీఆర్ఎస్ కౌన్సిలర్లను తమ గూటికి తీసుకెళ్లడంలో నాయకులు సఫలీకృతమయ్యారు.
కరీంనగర్ జిల్లాలో 2020లో ఒక కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీల్లోని 134 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఆనాడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ కేవలం 6 వార్డులకే పరిమితమైంది. అప్పటి అధికారపార్టీ బీఆర్ఎస్ మాత్రం 85 స్థానాల్లో విజయం సాధించిన తన సత్తాను చాటింది. ఆనాడు కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కానీ, ప్రస్తుత ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీల్లోని 140 స్థానాలు ఉండగా, బీఆర్ఎస్ 30 స్థానాల్లో విజయం సాధించింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం 50 స్థానాలకే పరిమితమైంది. అయితే 2020 ఎన్నికల్లో బీజేపీ 20 స్థానాలుండగా, ఇప్పుడు 42 స్థానాలు సాధించి ముందుకు వచ్చింది.
జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 2020లో మొత్తం 134 వార్డులుండగా.. ఆనాడు బీఆర్ఎస్ 84 వార్డుల్లో విజయం సాధించింది. అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ మాత్రం 20కి పరిమితమైంది. ప్రస్తుతం 136 వార్డుల్లో కాంగ్రెస్ 65 స్థానాల్లో విజయం సాధించగా, బీఆర్ఎస్ 21 స్థానాల్లో గెలిచింది. బీజేపీ అప్పుడు 13 వార్డుల్లో గెలువగా, ప్రస్తుతం ఆ సంఖ్య 27కు పెరిగింది. రాయికల్, మెట్పల్లిలో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించింది.

రాజన్న సిరిసిల్లలో 2020లో సిరిసిల్ల, వేములవాడ పురపాలకసంఘాల పరిధిలోని 67 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ మూడు వార్డులకు మాత్రమే పరిమితమైంది. ఆనాటి అధికార పార్టీ బీఆర్ఎస్ మాత్రం 37 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుత ఎన్నికల్లోనూ తన సత్తాను చాటింది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో 67 వార్డులకు 32 వార్డులను దక్కించుకున్నది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం 19 స్థానాలకే పరిమితమైంది. 2020లో బీజేపీ తొమ్మిది స్థానాల్లో విజయం సాధించగా, ఇప్పుడు 13 స్థానాలకు పెరిగింది.
2020లో ఎన్నికలు జరిగినప్పుడు పెద్దపల్లి జిల్లా పరిధిలోని మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో మొత్తం 64 కౌన్సిలర్ల స్థానాలు, రామగుండం కార్పొరేషన్లో 50 కార్పొరేటర్ల స్థానాలు ఉన్నాయి. ఆనాడు 44 కౌన్సిలర్, 18 కార్పొరేటర్ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ 13 కౌన్సిలర్ స్థానాలు, 11 కార్పొరేటర్ల స్థానాలకే పరిమితమైంది. ప్రస్తుతం జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో 64 కౌన్సిలర్ల స్థానాలు, కార్పొరేషన్లో 60 కార్పొరేటర్ల స్థానాలుండగా, అందులో 3 కౌన్సిలర్, 13 కార్పొరేటర్ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. అధికార పార్టీ కాంగ్రెస్ 51 కౌన్సిలర్, 38 కార్పొరేట్ స్థానాలను కైవసం చేసుకున్నది. బీజేపీ రెండు కౌన్సిలర్లు, ఒక కార్పొరేట్ స్థానంతో సరిపెట్టుకున్నది.
