కరీంనగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ముందుకు కదలడం లేదు.ఏళ్లు గడిచినా కొసెళ్లడం లేదు. కోట్లాది రూపాయలు వెచ్చించి చేపట్టిన పనులన్నీ భూగర్భంలోనే నిరుపయోగంగా మిగిలిపోతున్నాయి. అమృత్-2 పథకంలో చేపట్టిన ఈ పనులు రెండేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. ముఖ్యంగా నగరపాలక సంస్థ, పబ్లిక్ హెల్త్ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి.
కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 8 : కరీంనగరంలో అండర్ గ్రౌండ్ పనులను 2008లో ప్రారంభించారు. 2010 జూలై నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే, 2012 నాటికి ఈ ప్రాజెక్టు కింద 303 కిలోమీటర్ల మేర పైపులైన్లు, గోపాల్పూర్ చెరువులో ట్రీట్మెంట్ ప్లాంట్, 12,335 మ్యాన్‌హోల్స్, తదితర పనులు పూర్తి చేశారు. కాగా, ఐదేళ్ల క్రితం నగరంలోని ఎస్టీపీ (సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్)కు దగ్గరలో ఉన్న కాపువాడ, మారుతీనగర్, హౌసింగ్‌బోర్డుకాలనీ, నాకా చౌరస్తా ప్రాంతాల్లోని 5 వేల ఇళ్లకు పైగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కనెక్షన్లు ఇచ్చి వినియోగంలోకి తీసుకువచ్చారు. కాగా, అమృత్-2 కింద నగరంలో మిగిలిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీని వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించి రెండేళ్ల క్రితం పనులు మొదలుపెట్టారు.
అమృత్-2 కింద నగరంలో 79.57 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం టెండర్లు పిలిచి పనులు ప్రారంభించింది. వీటితో ఏడాదిన్నర క్రితం గతంలో వేసిన అండర్ గ్రౌండ్‌లోని మెయిన్ పైపులైన్(ట్రంక్ లైన్)లు సరిగా ఉన్నాయో లేదో పరిశీలన చేశారు. పలు ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్ నుంచి చెత్తను తొలగించడంతోపాటు క్లీనింగ్ ప్రక్రియ చేపట్టారు. అంతటితో పనులు ఆగిపోయాయనే చెప్పాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంచు పని కూడా ముందుకు సాగలేదు. ఈ నిధులతో నగరంలో వంద కిలోమీటర్ల మేరకు పైపులైన్లను సరిచేసి, 24 వేల ఇళ్లకు కనెక్షన్లు అందించాల్సి ఉంది. కాగా, ఈ పనుల్లో ఇప్పటి వరకు ఒక్క ఇంటికి కూడా కనెక్షన్ అందించలేదు. రెండేళ్లుగా పనుల్లో ఎలాంటి పురోగతి లేకుండా పోయిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ పనుల విషయంలో సీరియస్‌గా తీసుకొని పూర్తి చేయాలని సూచించారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్వహణను నగరపాలక సంస్థ చేపడుతున్నది. అమృత్-2 కింద వచ్చిన నిధులతో పబ్లిక్ హెల్త్ విభాగం పనులు చేస్తున్నది. అయితే, ఈ విభాగాల మధ్య సమన్వయం సరిగా లేకపోవడంతో ఎక్కడ పైపులైన్లు ఉన్నాయో.. ఎక్కడ ఇన్స్పెక్షన్ చాంబర్లు (ఇంటికి పైపులైన్‌కు కనెక్షన్ ఇచ్చే చాంబర్లు) నిర్మించాల్సి ఉన్నదో పబ్లిక్ హెల్త్ అధికారులకు తెలియకుండా పోయింది. నగరంలో గత ఐదేళ్లలో అనేక ప్రాంతాల్లో కొత్తగా సీసీ రోడ్లు వేశారు. వాటిలో అత్యధిక శాతం రోడ్లలో ఇన్స్పెక్షన్ చాంబర్లు నిర్మించేందుకు వీలుగా నగరపాలక సంస్థ ట్రంక్‌లైన్‌కు అనుసంధానం చేస్తూ పైపులైన్లు వేసింది. అయితే, పలు ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలు చేయలేదు. వీటిని గుర్తించే విషయంలో నగరపాలక, పబ్లిక్ హెల్త్ అధికారులు సమన్వయంతో పని చేస్తేనే ఈ పనుల్లో పురోగతి వచ్చే అవకాశమున్నది. ఈ దిశలో రెండు విభాగాలు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ జూన్‌లో కాంట్రాక్టు గడువు కూడా ముగిసే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. సకాలంలో నిధులను వినియోగించుకోకపోతే తిరిగి పోతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి వెంటనే పనుల్లో వేగం పెంచేలాచర్యలు తీసుకోవాల్సిన అవసరమున్నది.