రుణమాఫీ అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని బీఆర్ఎస్ ఎండగడుతున్న వేళ.. నాయకులను అణచివేసేందుకు పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గురువారం చొప్పదండిలో జరిగిన ఘటనే అందుకు నిదర్శనంగా నిలుస్తుండగా.. కేసు నమోదులో ఖాకీలు వ్యవహరించిన తీరుపై అనేక ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు ఈ వ్యవహారంలో మేజిస్ట్రేట్ అక్షింతలు వేయడంతోపాటు ఏకంగా రిమాండ్‌ను తిరస్కరించి, స్టేషన్ బెయిల్‌కు ఆదేశాలు ఇవ్వడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ మేరకు స్టేషన్ బెయిల్‌పై నాయకులు విడుదల కాగా.. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము దాకా జరిగిన హైడ్రామాపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. మొత్తం తొమ్మిది మందిపై కేసు పెట్టి, నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంకోవైపు మరికొంత మందిపై కేసుల నమోదుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
కరీంనగర్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / రాంనగర్ : రుణమాఫీ కోసం రైతులు రణం సాగిస్తున్నారు. ఇప్పటికే రోడ్డెక్కడంతోపాటు ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆది నుంచీ అన్నదాతలకు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాఫీ కోసం గురువారం నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఆ మేరకు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో చొప్పదండిలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసే సమయంలో పార్టీ నాయకులకు, పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సుంకె రవిశంకర్‌తో పాటు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, మరికొంత మంది నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య స్టేషన్లో ఉంచుకొని, ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేశారు. ఈ సమయంలో అంతా సాఫీగా సాగడంతో నాయకులు తమ ఇండ్లకు వెళ్లిపోయారు.
ధర్నాలు జరగడం.. అరెస్టులు చేయడం.. పోలీస్ స్టేషన్లకు తరలించడం, ఆ తర్వాత సొంత పూచీకత్తుపై వదిలిపెట్టడం సర్వసాధారణంగా జరిగేవి. ఇక్కడ కూడా అలానే జరిగిందని అందరూ భావించారు. కానీ, ఆ తర్వాత సీన్ మారింది. ధర్నా సమయంలో నాయకులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పేర్కొంటూ ఆగమేఘాల మీద చొప్పదండి పోలీసుస్టేషన్లో మొత్తం తొమ్మిది మందిపై కేసులు పెట్టారు. అందులో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెల్మ శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ గన్ను శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌తోపాటు కే మహేశ్, మున్సిపల్ కౌన్సిలర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు పెద్దెల్లి అనిల్, మారం రాజు, మునిపాల తిరుపతి రావు, నరేశ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిజానికి పోలీసులు చెబుతున్నట్టు ధర్నా సమయంలో.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, విధులకు ఆటంకం కలిగించినా సదరు నాయకులపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. కానీ. ఇక్కడ అలా జరగేలేదు.
అదుపులోకి తీసుకున్న నాయకులను మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్టేషన్ నుంచి వదిలిపెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, పోలీసులు సీన్మార్చి తమదైన కోణంలో హైడ్రామా మొదలు పెట్టారు. సాయంత్రం 4 గంటల సమయంలో స్టేషన్ ఎస్ఐ.. ముందుగా రవీందర్‌రెడ్డికి ఫోన్ చేసి నోటీసులు ఇవ్వాలని చెప్పగా, తాను కరీంనగర్‌లోని ఓ థియేటర్లో సినిమా చూస్తున్నట్టు చెప్పారు. ఏమైనా ముఖ్యమైన నోటీసులా? అని అడిగితే.. అవునంటూ ఎస్ఐ సమాధానమిచ్చారు. రవీందర్‌రెడ్డి సినిమా చూసి బయటకు వచ్చే వరకు, పలు స్టేషన్లకు సంబంధించి ఎస్‌ఐలతోపాటు టాస్క్ఫోర్సు పోలీసులు రెడీగా ఉండి అరెస్టు చేసి టాస్క్ఫోర్సు కార్యాలయానికి తరలించారు. అరెస్ట్ విషయాన్ని రవీందర్‌రెడ్డి తన భార్యతో చెబుతున్న సమయంలో పోలీసులు ఫోన్ లాగేసుకున్నారు. రవీందర్‌రెడ్డి భార్య ఈ విషయాన్ని బీఆర్ఎస్ నాయకుడు తిరుపతినాయక్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన బీఆర్ఎస్ అగ్రనేతలకు సమాచారమిచ్చారు.
ఇది ఇలా ఉంటే.. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గన్ను శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌ను అరెస్టు చేసిన పోలీసులు, మిగిలిన వారిని పరారీలో ఉన్నట్టు చూపారు. అరెస్టు చేసిన నలుగురిని రిమాండ్ చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టగా.. ఈ విషయంలో అత్యుత్సాహం చూపారన్న విమర్శలు వస్తున్నాయి. నిజానికి ఈ వ్యవహారంలో అర్ధరాత్రి సమయంలో రిమాండ్ కోసం మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరు పరుస్తున్న విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అండగా నిలిచారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆధ్యక్షుడు జీవీఆర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విజ్ఞప్తి మేరకు న్యాయవాది సర్దార్ రవీందర్‌సింగ్ అర్ధరాత్రి తన వాదనలు వినిపించా రు. రైతులకు సంబంధించి జరిగిన ధర్నా వ్యవహారం లో పోలీసులు ఇటువంటి కేసులు నమోదు చేయడం న్యాయ సమ్మతం కాదని, దీంతో పాటు అరెస్టు చేసిన వారికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, ఇదంతా చూస్తే ఉద్దేశ పూర్వకంగా కేసులు నమోదు చేసినట్టు అర్థమవుతుందని పేర్కొన్నారు. అన్నింటినీ పరిశీలించిన న్యాయమూర్తి రిమాండ్‌ను తిరస్కరిస్తూ స్టేషన్ బెయిల్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో చొప్పదండి స్టేషన్లో పోలీసులు బెయిల్ ఇచ్చారు. సంబంధిత నాయకులు వారి వారి ఇండ్లకు చేరుకునే వరకు తెల్లవారుజామున 3 గంటలు అయిందని నాయకులు తెలిపారు.
నిజానికి ఆందోళన సమయంలో సదరు నాయకులు పోలీసులకు ఇబ్బందులు సృష్టించి ఉంటే.. మధ్యాహ్నం 11 నుంచి 12 గంటల మధ్యలో స్టేషన్లో ఉన్నప్పుడే కేసులు నమోదు చేయాలి. అక్కడే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపాలి. కానీ, ఇక్కడ పోలీసులు అవేవీ చేయలేదు. స్టేషన్లో ఉన్న నాయకులను మధ్యాహ్నం 12 గంటల తర్వాత వదిలిపెట్టారు. ఒక వేళ తప్పుచేసి ఉంటే ఎందుకు వదిలి పెడుతారన్న ప్రశ్నలకు సమాధానం లేదు. అంతేకాదు, పోలీసులు ముందుగా వదిలిపెట్టి, మళ్లీ కేసులు నమోదు చేసి ఎందుకు అరెస్టు చేశారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంటే మొత్తంగా ఈ వ్యవహారాన్ని చూస్తే మధ్యలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు వచ్చాయా..? లేక ఎవరైనా పోలీసులే అత్యుత్సాహం చూపారా..? భవిష్యత్‌లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి ముందుకు రాకుండా భయభ్రాంతులకు గురి చేయాలన్న కుట్రలు అందులో ఉన్నాయా..? అన్న కోణంలో ప్రస్తుతం చర్చ జరుగుతున్నది. ఇవేకాదు ఎఫ్ఐఆర్లో రవీందర్‌రెడ్డి విషయంలో పేర్కొన్న పలు అంశాలను చూస్తే ఎలాగైనా సరే.. అతనితోపాటు మిగిలిన వారిని రిమాండ్‌కు పంపి తీరాలన్న ఉత్సాహం అందులో కనిపిస్తున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ధర్నా సందర్భంగా పెట్టిన కేసు కంటే ఎక్కువగా రవీందర్‌రెడ్డిపై గతంలో ఉన్న కేసులను ఎఫ్ఐఆర్లో వివరిస్తూ వచ్చిన పోలీసుల తీరు దీనికి నిలువెత్తు నిదర్శనమన్న విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా చొప్పదండి నియోజకవర్గంలో సోషల్ మీడియా వేదికగా పనిచేస్తున్న మరికొంత మంది బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్టున్నట్టు విశ్వసనీయ సమాచారం అందుతున్నది.
ఈ కేసులు మాకు కొత్త కాదు. అరెస్టులకు భయపడేది లేదు. నాడు రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడిన సమయంలో బీఆర్ఎస్ శ్రేణులపై అనేక కేసులు పెట్టారు. వాటిని న్యాయస్థానం ద్వారా ఎదుర్కొన్నాం. ఇప్పుడు రైతులకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేస్తున్నాం. ఇప్పుడూ కేసులు పెడుతున్నారు. వీటికి ఏ బీఆర్ఎస్ నాయకుడు భయపడడు. న్యాయస్థానం మీద నమ్మకంతో ముందుకు సాగడమే మా లక్ష్యం. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చే ప్రతి ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే ధ్యేయంగా ఆయా వర్గాలను కలుపుకొని ముందుకెళ్లి తీరుతాం.
– ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ గ్రంథాలయసంస్థ మాజీ చైర్మన్