Vemulawada | వేములవాడ, జూన్ 18 : కనీస అద్దె కరువై వేములవాడ పట్టణంలో ఓ కుటుంబం వీధిన పడింది. జగిత్యాల జిల్లా ఎకిన్ పూర్ చెందిన సతీష్ తో రామిడి మానసకు వివాహం కాగా వారి దాంపత్య జీవితంలో ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే గత ఎనిమిది సంవత్సరాలుగా భర్త పట్టించుకోకపోవడంతో తన కూతురు కుమారుడుతో పాటు కన్నతల్లి వరలక్ష్మితో కలిసి వేములవాడ పట్టణంలో కూలి నాలి చేసుకుంటూ జీవనోపాధి పొందుతోంది. దుకాణాలలో పనిచేస్తూ జీవనోపాధి పొందుతుండగా వచ్చే అరకొర జీతంతో అద్దెకు ఉండడం కూడా భారంగా మారింది.
అయినప్పటికీ భగవంత రావు నగర్ లోని ఒక పాత ఇంటిలో అద్దెకు ఉండగా వర్షాకాలం నేపథ్యంలో పాడుబడిన నివాసాల్లో జనసంచారం ఉండకూడదని మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వెంటనే ఈ కుటుంబాన్ని అక్కడి నుండి బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించారు. వర్షం వచ్చి ఇల్లు కూలడం ఏమో కానీ ప్రస్తుతం ఈ కుటుంబం మాత్రం వీధిన పడింది.
ఇక పది రోజులుగా అద్దె ఇంటి కోసం వెతుకుతుండగా రూ.3వేల పైగా మాత్రమే అద్దె గదుల ధరలు ఉండడంతో అంత చెల్లించలేని దీనస్థితిలో ఉండి తక్కువ ధరకు ఒకే గది కావాలని తిరుగుతున్న అద్దె గది దొరకకపోవడంతో వేములవాడ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని ఓపెన్ జిమ్ లో తమ ఇంటి సామాను అంతటినీ పెట్టుకొని కుటుంబంతో సహా బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. నిలువ నీడలేని తన కుటుంబానికి ప్రభుత్వం కనీసం ఉండడానికి ఒక గూడైనా కల్పించాలని మానస అధికారులను వేడుకుంటోంది.