కరీంనగర్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : వరుస దొంగ తనాలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న ఇద్దరు దొంగలను కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను సీపీ గౌష్ ఆలం పోలీసు కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేటలోని అశోక్‌నగర్‌కు చెందిన సూర రవి తల్లితో కలిసి కరీంనగర్లో ఉంటున్నాడు. వ్యసనాలకు బానిస కావడంతో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. గతంలో కరీంనగర్లో పలు దొంగతనం కేసుల్లో జైలుకు కూడా వెళ్లి వచ్చాడని, అయినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదని సీపీ తెలిపారు. రవి తరచూ దొంగతనాలకు పాల్పడుతుండడంతో విసిగి పోయిన భార్య పిల్లలు సహా పుట్టింటికి వెళ్లిపోయిందని తెలిపారు.
అయితే గత నెల 13న రాత్రి సప్తగిరి కాలనీలోని ఒక ఇంట్లో చొరబడి నగదు, బంగారు ఆభరణాలను దొంగిలించాడు. వీటిని విజయవాడలో అమ్మేసి జల్సాలు చేశాడు. గురువారం పద్మనగర్ చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి, అతడి నుంచి రెండు బంగారు బిస్కట్లు, కత్తిరించిన బంగారు కడ్డీలు స్వాధీనం చేసుకున్నారని, వీటి మొత్తం 105 గ్రాములు ఉంటుందని సీపీ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న ఎస్ఐ ఏ తిరుపతి, హెడ్ కానిస్టేబుళ్లు జీ రవీందర్ సాయి దీప్, అవినాష్, మల్లయ్య, సాయికిరణ్‌ను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.
కరీంనగర్ బస్టాండ్‌లో ప్రయాణికుల లగేజీ బ్యాగులు చోరీ చేస్తున్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. నిందితుడి నుంచి 150 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. గురువారం ఉదయం వన్ టౌన్ సీఐ బిల్లా కోటేశ్వర్ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెందిన కంది సంపత్‌రెడ్డి అనే వ్యక్తి ముఖానికి మాస్క్ వేసుకుని తిరుగుతుండగా అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు.
అతడిని విచారించగా బస్టాండ్‌లో లగేజీ బ్యాగులు, బంగారు నగలను దొంగిలించినట్లు అంగీకరించినట్లు సీపీ తెలిపారు. గత ఫిబ్రవరి 13న కరీంనగర్ బస్టాండ్‌లో ఒక మహిళ బ్యాగు నుంచి 16.5 తులాల బంగారు ఆభరణాలు, అదే నెల 24న మరో మహిళ బ్యాగు నుంచి 47 గ్రాముల బంగారం, ఈ నెల 8న గోదావరిఖని నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఒక వృద్ధుడికి చెందిన రూ. 13 లక్షలు దొంగిలించినట్లు అంగీకరించాడని, దొంగిలించిన సొత్తును దాచుకునే ప్రయత్నంలో అతడిని పోలీసులు పట్టుకున్నారని సీపీ తెలిపారు. ఈ కేసులో నిందితుడిని పట్టుకున్న పోలీసులను అభినందించారు.