మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు గన్‌డౌన్ చేశారు. అలియాస్ చంద్రన్న, శంకరన్న, సోమన్నగా గుర్తింపు పొందిన ఆయన, నలభై ఐదేండ్ల సాయుధ పోరాటానికి, అజ్ఞాత జీవితానికి స్వస్తి పలికారు. సహచర మావోయిస్టు నేత బండి ప్రకాశ్‌తో కలిసి ఆయన, మంగళవారం రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయారు. జన జీవన స్రవంతిలో కలిసిపోయారు. అయితే లొంగుబాటు సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
పెద్దపల్లి, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ)/ జూలపల్లి : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్‌కు చెందిన పుల్లూరి శ్రీనివాస్‌రావు, తల్లి వరలక్ష్మి దంపతుల రెండో కొడుకు ప్రసాదరావు. 1961లో జన్మించిన ఆయనకు, ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. తండ్రి ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం కాగా, తల్లి గృహిణి. స్వగ్రామంలోనే పదో తరగతి చదివారు. 1979లో పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ చదువుతున్న సమయంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్(ఆర్ఎస్యూ) ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న జిల్లాకు చెందిన దగ్గు రాజలింగుతో పరిచయం ఏర్పడడంతో సిద్ధాంతాలవైపు ఆకర్శితుడయ్యారు.
1980లో ఇంటర్ పూర్తి చేసిన తర్వాత మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వర్రావు అలియాస్ కిషన్‌జీకి కొరియర్‌గా పనిచేశారు. ఆ సయమంలో హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించారు. మంథని ప్రాంతానికి చెందిన మల్లారాజిరెడ్డి అలియాస్ మీసాల సత్తన్న, లచ్చన్న, సంగ్రాం నాయకత్వంలో దండకారణ్య ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సాయుధ దళంలో చేరారు. సీపీఐ ఎంఎల్ కేఎస్ గ్రూప్ కార్యక్రమాల్లో పాల్పపంచుకున్నారు. దండకారణ్యానికి వెళ్తున్న సమయంలో పూర్వపు మధ్యప్రదేశ్ భాగం బీజాపూర్‌లో జిల్లాలోని భూపాలపట్నం వద్ద మరో ఇద్దరు మావోయిస్టులతో కలిసి అరెస్టయ్యారు.
డిసెంబర్లో జైలు నుంచి విడుదలై, 1981లో తిరిగి పార్టీతో సంబంధాలు పునరుద్ధరించుకొని, ఆదిలాబాద్ జిల్లాలోని సీపీఐ ఎంఎల్ పీపుల్స్‌వార్ ఆసిఫాబాద్ దళ సభ్యుడిగా చేరారు. ఆ తర్వాత సిర్పూర్ దళంలో, చెన్నూరు సాయుధ దళాల్లో డివిజనల్ కమిటీ కార్యదర్శిగా, జిల్లా కమిటీ కార్యదర్శిగా 1995లో పీపుల్స్‌వార్(పీడబ్ల్యూజీ) నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీలో కీలకంగా పనిచేశాడు. ఆ తర్వాత మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీలో సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.
2015వరకు నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. 2021లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా నియమితులై 2024వరకు పనిచేశారు. 17 ఏండ్లకు పైగా పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడి హోదాలో పని చేశారు. ఉద్యమంలో పనిచేస్తూనే 1989లో పార్టీలో డివిజనల్ కమిటీ సభ్యురాలిగా ఉన్న అగు కుర్సంగి మోతిబాయి అలియాస్ రాధక్కను వివాహం చేసుకున్నారు. 2013జూన్‌లో రాధక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రాంతంలో అరెస్టు అయింది. ఆ తర్వాత ఆమె జైలు నుంచి విడుదలై ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోని తన స్వగ్రామంలో నివసిస్తున్నది. అజ్ఞాతంలోకి చేరినప్పటి నుంచి ప్రసాదరావు, జిల్లాలో ఎప్పుడూ ఎలాంటి కార్యక్రమంలో పాల్గొనలేదు.
తల్లిదండ్రులు మరణించిన సమయంలోనూ అజ్ఞాతాన్ని వీడి రాలేదు. 2004లో జరిగిన శాంతి చర్చల సమయంలో ప్రస్తుత పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటలో మావోయిస్టు అమరవీరుల స్మారక స్తూప నిర్మాణంలో మావోయిస్టు మరో నేత బండి ప్రకాశ్ కీలకంగా పనిచేశారు. రామగిరి ఖిల్లాపై అడ్డా పెట్టి ఆవిష్కరించేంత వరకూ ప్రజల మధ్యే ఉండి స్తూప ఆవిష్కరణను పూర్తి చేశారు. ఇలా బండి ప్రకాశ్‌తో సైతం పెద్దపల్లి జిల్లాకు విడదీయరానికి అనుబంధం ఉంది. జిల్లాకు సుపరిచితులైన ఇద్దరు మావోయిస్టు నేతలు గన్ డౌన్ చేయడంతో ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
అజ్ఞాత జీవితానికి స్వస్తి పలికి జన జీవన స్రవంతిలో కలిసిన పుల్లూరి ప్రసాదరావు లొంగుబాటు సందర్భంగా చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి. తమది లొంగు బాటు కాదని, అభివృద్ధిలో కలిసి పనిచేయడానికే జనజీవన స్రవంతిలో కలిశామని చెప్పడం ఒక్కసారిగా ప్రాధాన్యం సంతరించుకున్నది. ‘ఇప్పటి వరకు ఉద్యమంలో పీడిత ప్రజల కోసం పనిచేశాం. భవిష్యత్‌లోనూ అలాగే పనిచేస్తాం. తమ సిద్ధాంతం ఓడిపోలేదు. దాన్ని ఓడించడం ఎవరి తరం కాదు. ప్రజల మధ్య ఉండి సేవ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం. ఆయుధాలను పార్టీకే ఇచ్చి జనంలోకి వచ్చాం’ అని చెప్పడం రాజకీయంగా కలకలం రేపింది. రానున్న రోజుల్లో పుల్లూరి ప్రసాదరావు తమ సొంత జిల్లా అయిన పెద్దపల్లి నుంచి రాజకీయంగా అడుగులు వేస్తారా..? అందుకే నర్మగర్భంగా ఈ వాఖ్యలు చేశారా..? అని రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నది.