Accident | మెట్పల్లి , ఏప్రిల్ 12: జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణం 63వ జాతీయ రహదారిలో ఎస్సారెస్పీ కాకతీయ ప్రధాన కాలువ వంతెనపై శనివారం గ్రానైట్ లారీ, గూడ్స్ కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గ్రానైట్ లారీ డ్రైవర్ పరదేశి చౌదరి (35) క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. పోలీసులు, స్థానిక యువకులు జేసీబీ సహాయంతో క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను సుమారు రెండు గంటల తర్వాత బయటకు తీశారు.
కాలుకు తీవ్ర గాయం కావడంతో డ్రైవర్ ను చికిత్స నిమిత్తం కరీంనగర్ కు తరలించారు. వంతెనపై ఈ ప్రమాదం జరగడంతో ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జగిత్యాల నుంచి నిజామాబాద్ వైపు వెళ్లే వాహనాలను వెల్లుల్ల బండలింగాపూర్ మీదుగా, నిజామాబాద్ వైపు నుంచి జగిత్యాలకు వెళ్లే వాహనాలను ఇబ్రహీంపట్నం మీదుగా దారి మళ్లించారు.