తులం బంగారం హామీ ఏమైంది?
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్షతోపాటు తులం బంగారం ఇంకెప్పుడిస్తారంటూ కాంగ్రెస్ నాయకులను జగిత్యాల పట్టణ, మండల మహిళలు నిలదీశారు. ఇంత వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. ‘
- ప్రభుత్వం ఎందుకు స్పందిస్త లేదు
- కల్యాణలక్ష్మి చెక్కులతోపాటు చీరెలిస్తే అడ్డుకోవడం ఏంది?
- జీవన్‌రెడ్డి భార్య, కోడళ్లే చీరెలు కట్టుకోవాల్నా? మాకు వద్దా..?
- ప్రశ్నించిన జగిత్యాల పట్టణ, మండల మహిళలు
- కాంగ్రెస్ నాయకుల తీరుపై ఆగ్రహం.. రోడ్డెక్కి నిరసన
- జగిత్యాలలో రసాభాసగా కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
- ప్రొటోకాల్‌పై ఇరుపార్టీ శ్రేణుల మధ్య తోపులాట
జగిత్యాల/జగిత్యాల రూరల్, మార్చి 9: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్షతోపాటు తులం బంగారం ఇంకెప్పుడిస్తారంటూ కాంగ్రెస్ నాయకులను జగిత్యాల పట్టణ, మండల మహిళలు నిలదీశారు. ఇంత వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. ‘మీరు ఇవ్వరు.. ఇచ్చే వాళ్లను ఇవ్వనివ్వరా..’ అంటూ ప్రశ్నించారు. జగిత్యాల రూరల్ తహసీల్ కార్యాలయంలో శనివారం జగిత్యాల అర్బన్, రూరల్ మండలాలకు చెందిన 303 మంది లబ్ధిదారులకు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
అయితే కేసీఆర్ సర్కారు ఉన్నప్పటి నుంచి ఆడబిడ్డలకు చెక్కులతోపాటు చీరెలను అందించే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఎమ్మెల్యే సంజయ్, ఇప్పుడు కూడా అలానే ఇవ్వాలనుకున్నారు. ఈ మేరకు తహసీల్ ఆఫీసుకు కొద్ది దూరంలో లబ్ధిదారులకు చీరలు ఇచ్చేందుకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధమయ్యారు. అంతలోనే కాంగ్రెస్ నాయకులు వచ్చి పంపిణీని అడ్డుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చీరెలు ఇవ్వకుండా ఆపేశారు. తర్వాత చీరెలతో ఉన్న వాహనాన్ని అక్కడి నుంచి పంపించారు. దీంతో మహిళలు ఆగ్రహించి, రోడ్డెక్కారు.
కాంగ్రెస్ నాయకుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మి సాయంతోపాటు ఇస్తానన్న తులం బంగారం ఇవ్వకపోగా, ఎమ్మెల్యే ఇచ్చే చీరను ఇవ్వకుండా అడ్డుకోవడం ఏంటంటూ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. మహిళలను ఆడబిడ్డలుగా భావించి గౌరవంతో చీరలు అందిస్తే ఎందుకంత కండ్లమంట? అని నిలదీశారు. ‘జీవన్‌రెడ్డి ఇంట్లకెళ్లి ఏమైనా ఇస్తున్నడా..? ఆ చీరెలు ఆయన భార్య, కోడళ్లే కట్టుకోని. మాకేం వద్దు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం తులం బంగారం ఇస్తే, అప్పుడు తాము చీర తీసుకోమని స్పష్టం చేశారు. అయినా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎలా అడ్డుకుంటారని..? ఇది కాంగ్రెసోళ్ల అత్యుత్సాహమేనని మండిపడ్డారు.
ప్రొటోకాల్ వివాదం
జగిత్యాల జిల్లా కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ రసాభాసగా మారింది. సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతుండగానే.. ప్రొటోకాల్ వివాదం ప్రారంభమైంది. ఫ్లెక్సీలో సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో తప్ప ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఫొటో ఎందుకు లేదని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమంలో ఫొటో లేకపోవడం ఏంటని ఆగ్రహించారు. ప్రతి సారి ఇలాగే చేస్తున్నారని, ఇది సరికాదన్నారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ మొదలైంది. విప్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే సమక్షంలోనే ఇరుపార్టీల నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వేదిక నుంచి దిగివచ్చి తమతమ పార్టీలకు చెందిన నాయకులను సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. చివరికి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ జోక్యం చేసుకొని, ప్రొటోకాల్ విషయంలో కలెక్టర్‌తో మాట్లాడుతానని, తప్పనిసరిగా స్థానిక ఎమ్మెల్యేల ఫొటోలు ఉండేలా చూస్తానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌కు ఎందుకంత అక్కసు
పదేండ్ల కేసీఆర్ సర్కార్ పాలనలో ఏనాడూ ఇలాంటి రసాభాస కార్యక్రమాలు లేవు. కాంగ్రెస్ పార్టీ ఎందుకింత అక్కసుతో వ్యవహరిస్తున్నది. తులం బంగారం హామీ విషయం మాట్లాడకుండా చేసింది. ఆడబిడ్డలకు చీరలు ఇవ్వకుండా చేసింది. జగిత్యాల నియోజకవర్గంలో ప్రతిసారి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా ప్రొటోకాల్ వివాదం తలెత్తుతున్నది. కావాలనే ఫ్లెక్సీలపై ఫొటోలు పెట్టడం లేదు.
– డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే
చీరెలను ఇవ్వకుండా చేసుడేంది?
సంజయ్ సారు ఇస్తున్న చీరెలను ఇవ్వకుండా కాంగ్రెసోళ్లు అడ్డుకోవడం విడ్డూరంగా ఉన్నది. జీవన్‌రెడ్డి చీరెలు ఇంట్లకెళ్లి ఇస్తున్నడా? ఆయన భార్య, కోడళ్లే కట్టుకోండ్రి. ఎన్నికల సమయంలో తులం బంగారం అన్నరు కదా. ఇంకా ఇస్తలేరు. కనీసం చీరెలను ఇవ్వకుండా చేసుడేంది?
– భాగ్య, లబ్ధిదారురాలు, సంఘంపల్లి
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

