జమ్మికుంట, అక్టోబర్ 26: దేశంలోనే అత్యుత్తమ సహకార బ్యాంకుగా కరీంనగర్ డీసీసీ సేవలందిస్తున్నదని, విప్లవాత్మకమైన మార్పులతో రైతులకు సేవలందిస్తున్నామని నాఫ్స్ కాబ్, కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్రావు స్పష్టం చేశారు. కమర్షియల్ బ్యాంకులకు ధీటుగా వ్యవసాయ, వ్యవసాయేతర వ్యాపారాల్లో రాణిస్తున్నామని, సీఎం కేసీఆర్ సహకార సంఘాలకు అందిస్తున్న ప్రోత్సాహంతో బ్యాంకు వ్యాపార సరళినే మార్చినట్లు తెలిపారు. గురువారం ఆయన జమ్మికుంట పట్టణంలోని కేడీసీసీ బ్యాంకును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్ బ్యాంక్ రూ.400కోట్లతో లావాదేవీలు నిర్వహించేదని, 2011లో రూ.70 కోట్ల అప్పుల్లో కూరుకుపోయి ఉన్న సందర్భాన్ని గుర్తు చేశారు.
బ్యాంకును మూసివేసే దశ నుంచి నేడు రూ.6వేల కోట్ల ఆర్థిక లావాదేవీలతో విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు గర్వపడుతున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో రూ.10వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, అందుకు సీఈవోతో సహా బ్యాంకు అధికారులు, సిబ్బంది సేవలను కొనియాడారు. జమ్మికుంట బ్యాంకు రూ.100 కోట్లతో నడుస్తున్నదని, అధికారులు, సిబ్బంది పనితీరును అభినందించారు. గత ఏడేళ్లుగా దేశంలో అత్యుత్తమ సహకార బ్యాంకుగా గుర్తింపును సొంతం చేసుకుందని, అవార్డులు అందుకుంటున్న విషయాలను వివరించారు. జిల్లా బ్యాంకు దేశానికే ఆదర్శంగా పనిచేస్తున్నదని, కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్‌షా నుంచి వచ్చిన ప్రశంసలను తెలిపారు.
ఇక్కడి సహకార వ్యవస్థను ఆదర్శంగా తీసుకుని దేశంలో అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతున్నదని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆప్కాబ్ కేవలం రూ.6వేల కోట్ల టర్నోవర్ మాత్రమే ఉండేదని, తెలంగాణ ఏర్పాటు తర్వాత టెస్కాబ్ రూ.20వేల కోట్లకు చేరుకుందని తెలిపారు. బ్యాంకు వార్షిక బడ్జెట్, రుణాలు, తదితర అంశాలను వివరించారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో (ఉమ్మడి)72 డీసీసీబీ బ్రాంచీలున్నాయని, అందులో రూ.20వేల కోట్ల టర్నోవర్ ఉన్నట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.12వేల కోట్లున్న టర్నోవర్‌ను స్వరాష్ట్రంలో రూ.40వేల కోట్లకు తీసుకెళ్లిన ఘనత సహకారం వ్యవస్థదేనని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో 100 బ్రాంచీలను ఏర్పాటు చేస్తామని, దేశమే గర్వపడేలా సేవలందిస్తామని చెప్పారు.
కమర్షియల్ బ్యాంక్‌లకు తీసిపోని విధంగా విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు. నాబార్డు నుంచి వచ్చిన ప్రతి స్కీంను జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రవేశపెడుతున్నారని, దీంతో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటున్నదని చెప్పారు. చొప్పదండి తదితర ప్రాంతాల్లో సమీకృత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ సంవత్సర కాలంలోనే ఆదాయాన్ని రెట్టింపు చేయిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి రైతుకు రుణం అందించడమే లక్ష్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన పథకాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
గ్రామాల్లోని సీడెడ్ సొసైటీ(పీఏసీఎస్)లు గతంలో కమర్షిల్ బ్యాంకుల్లో రుణాలు పొందే అవకాశం ఉండేదని, కమర్షియల్ బ్యాంకుల్లో రైతులకు రుణ వడ్డీ రూ.8.3 శాతంగా ఉంటున్నదని తెలిపారు. కేడీసీసీ బ్యాంకుల్లో వడ్డీ 5.8 శాతం ఉంటుందని, మరో 3శాతం రిబేట్ రైతుకు వస్తుందని చెప్పారు. ఫలితంగా రైతుకు కేవలం 2.8 శాతం వడ్డీ మాత్రమే డీసీసీ బ్యాంకులు ఇస్తున్నాయని పేర్కొన్నారు. దీన్ని గుర్తించిన సీడెడ్ పీఏసీఎస్‌లు సహకార బ్యాంకుల్లో విలీనం అయ్యేందుకు తీర్మానాలు చేస్తున్నాయని తెలిపారు. జమ్మికుంట మండలంలోని తనుగుల పీఏసీఎస్‌లో 1165 మంది సభ్యులు.. రూ.5కోట్ల 25 లక్షల టర్నోవర్, ధర్మారం పీఏసీఎస్‌లో 364 సభ్యులు.. రూ. కోటి 82 లక్షల టర్నోవర్‌గా ఉందని, రెండు సంఘాలు బ్యాంకులో విలీనం అవుతున్నందుకు అభినందనలు తెలిపారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు రుణమాఫీ చేశారని, రుణమాఫీ పొందిన ప్రతి రైతుకు తిరిగి రుణం అందిస్తున్నామని తెలిపారు. అనంతరం ఇటీవల రుణమాఫీ పొందిన పలువురు రైతులకు కొత్తగా రుణాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. అంతకుముందు బ్యాంకుకు వచ్చిన రవీందర్‌రావుకు కేడీసీసీబీ వైస్ చైర్మన్ పింగిళి రమేశ్, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు జమ్మికుంట కేడీసీసీబీ మేనేజర్ మాధవి, తదితరులు స్వాగతం పలికారు. కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావు, ధర్మారం, తనుగుల పీఏసీఎస్ చైర్మన్లు శ్రీకాంత్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, కార్యదర్శులు, పాలకవర్గ సభ్యులు, అధికారులు, సిబ్బంది, రైతులు ఉన్నారు.