పెద్దపల్లి, జూలై 27(నమస్తే తెలంగాణ)/ ఓదెల/జమ్మికుంట : కాజీపేట- బల్లార్షా మార్గంలో శుక్రవారం రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు నిలిచిపోవాల్సి వచ్చింది. పెద్దపల్లి-కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.119.5 కోట్లు మంజూరు కాగా, పనులు చివరి దశలో ఉన్నాయి. ఆర్వోబీ కోసం గడ్డర్లు ఏర్పాటు చేస్తుండగా ఇనుప క్లస్టర్ విరగడంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. రైళ్లు వెళ్లే టైంలో అది కూలితే మరింత ప్రమాదమని గుర్తించిన అధికారులు వెంటనే రైళ్ల రాకపోకలను నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు.
దీంతో కొలనూర్, ఓదెల, పొత్కపల్లి, బిజిగిరిషరీఫ్, జమ్మికుంట, ఉప్పల్, రాఘవాపూర్, రామగుండం తదితర స్టేషన్లలో ఢిల్లీ చెన్నై, నిజామాబాద్ రూట్లలో వెళ్లే ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్, రాజధాని, గూడ్స్, ప్యాసింజర్ రైళ్లన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భాగ్యనగర్, బల్లార్షా రైళ్లు 5గంటలకు పైగా ఆలస్యంగా నడిచాయి. గ్రామీణ ప్రాంత స్టేషన్లలో గంటల తరబడి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగడం వల్ల దూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులు తినుబండారాలు, నీళ్లు దొరక్క అవస్థలు పడ్డారు.
పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లో భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ సుమారు 4 గంటల పాటు నిలిచిపోవడంతో చేసేదేమీ లేక ప్రయాణికులు రైలు దిగి కాలినడక ధర్మారం అడ్డారోడ్డుకు వచ్చి, అక్కడి నుంచి ఆటోలు, బస్సుల్లో వారి గమ్యాలకు చేరుకున్నారు. ఎట్టకేలకు ఉదయం 11గంటల తర్వాత మరమ్మతులు పూర్తికావడంతో రైళ్ల రాకపోకలు నెమ్మదిగా కొనసాగాయి.