Godavarikhani | కోల్ సిటీ, జూలై 24: ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చి పడుకున్నాడు. తెల్లవారకముందే శాశ్వత నిద్రలోకి వెళ్లాడు. ఏమైందో ఏమో గానీ.. ఒక్కసారిగా వాంతులు, కడుపునొప్పి అంటూ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. గోదావరిఖనిలో గురువారం తెల్లవారు జామున జరిగిన హృదయ విదారకర ఘటన పలువురిని కలిచివేసింది.
స్థానిక కాకతీయ నగర్ కు చెందిన కొత్తపల్లి రమేష్ (44) ఫై ఇంక్లయిన్ ఏరియా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో సపోర్టింగ్ స్టాఫ్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారు జామున ఆకస్మాత్తుగా వాంతులు, కడుపునొప్పితో తల్లడిల్లుతూ ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకవెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. అంతటి విషణ్ణ వదనలో ఉండి కూడా కుటుంబ సభ్యులు సమాజ హితం గురించి ఆలోచించారు.
మృతుడి నేత్రాలను దానం చేయడానికి తండ్రి కనకయ్య, సోదరులు శంకర్, సురేశ్, సోదరీ జ్యోతి అంగీకారం తెలిపారు. దీంతో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టెక్నిషియన్ సాయంతో మృతుడి కార్నియాలను సేకరించి హైదరాబాద్ కు తరలించారు. కుటుంబ సభ్యులను లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ రాజేందర్, సదాశయ ప్రచార కార్యదర్శి కేఎస్ వాసు అభినందించారు. అలాగే రమేష్ మృతి పట్ల పీహెచ్సీ వైద్య సిబ్బంది సంతాపం ప్రకటించారు.