కరీంనగర్ : నగరంలోని వావిలాలపల్లిలో విషాదం చోటు చేసుకుంది. చొప్పదండి మండలానికి చెందిన ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య( Lovers commit suicide) చేసుకున్నారు.. పోలీసులు, బంధువుల వివరాల ప్రకారం..చొప్పదండి మండలం చిట్యాలపల్లికి చెందిన కొండపర్తి అరుణ్ కుమార్ (24), అదే మండలం భూపాలపట్నంకు చెందిన నాంపెల్లి అలేఖ్య (22) గత కొంత కాలంగా ప్రేమలో (Lovers ) ఉన్నారు. దగ్గరి బంధువులు కూడా అయిన వీరు అలేఖ్య తల్లి దండ్రులకు తమ ప్రేమ విషయాన్ని తెలిపారు.
అయితే అలేఖ్య తల్లిదండ్రులు కొంత కాలం క్రితం అరుణ్ ఇంటికి వెళ్లి మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తామని ఆయన తల్లి దండ్రులను అడిగారు. అరుణ్ తల్లిదండ్రులు ఇప్పుడే పెండ్లి చేయమని చెప్పారు. అప్పటి నుంచి ఈ రెండు కుటుంబాలు కాస్త దూరంగా ఉంటున్నాయి. ఈ మధ్య అలేఖ్యకు వేరే సంబంధం చూసి పెండ్లి నిశ్చయం చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ప్రేమికులు మనస్థాపానికి గురయ్యారు.
బుధవారం కాలేజీకి వెళ్లి సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని భూపాలపట్నం నుంచి అలేఖ్య కరీంనగర్‌కు వచ్చి కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న అరుణ్ వద్దకు వెళ్లింది. అక్కడి నుంచి ఇద్దరు కలిసి స్థానిక వావిలాలపల్లిలో అరుణ్ అద్దె గదికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని కరీంనగర్ త్రీ టౌన్ సీఐ తెలిపారు. అరుణ్ తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.