Strike notice | జ్యోతినగర్, మే 3: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘాలు ఈ నెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం నాయకులు ఎన్టీపీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ కు శనివారం సమ్మె నోటీసును అందజేశారు. అనంతరం యునైటెడ్ ఫోరం నాయకులు మాట్లాడారు.
కార్మికులకు నష్టదాయకంగా కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు పరచాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికుల కనీస వేతనం నెలకు రూ.26వేలు చెల్లించాలని, ఎన్టీపీసీలో గత అగ్రిమెంట్ ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులకు అమలు పరుచాల్సిన ప్రమోషన్ పాలసీ అమలు, కార్మికులందరికి పూర్తి అలవెన్స్లు, కనీస పెన్షన్ నెలకు రూ.9వేలు చేల్లించాలని, ఇతర డిమాండ్లతో కూడిన సమ్మెనోటీసును అందజేసిన వారు ఎన్టీపీసీలో సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం ఐఎన్టీయూసీ, సీఐటీయూ, ఐఎన్టీయూ, ఏఐటీయూసీ, టీఎన్టీయూసీ, జీఏఎన్సిడబ్ల్యూయూ, బీఆర్డీయూ, హెచ్ఎంఎస్, కేసీఎంఎస్, టీయుసీఐ అనుబంధ సంఘాల నాయకులు భూమల్ల చందర్, నాంసాని శంకర్, చిలుక శంకర్, ఆర్ లక్ష్మణ్, ఏ శ్రీనివాస్, ఆర్ రాజమల్లయ్య, ఇజ్జగిరి భూమయ్య, డీ సత్యం, చింతల సత్యం, జీ వైకుంఠం పాల్గొన్నారు.